వాళ్ల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాకు దక్కాయి.. మోదీ మత్తులో ఉన్నట్లు మాట్లాడుతున్నారు

3 Aug, 2022 11:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

పరస్పర అంగీకారంతో  కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు.

 
చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్‌ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ  పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్‌ భూభాగంలోకి ఫైటర్‌ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లను సైతం హ్యాక్‌ చేసింది.
చదవండి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!

మరిన్ని వార్తలు