బిహార్‌లో ఎన్‌డీఏదే విజయం!

13 Oct, 2020 04:07 IST|Sakshi

టైమ్స్‌నౌ–సీ ఓటర్‌ సర్వే

న్యూఢిల్లీ: బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికే విజయమని ‘టైమ్స్‌నౌ–సీ ఓటర్‌’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బిహార్‌ అసెంబ్లీలోని 243 సీట్లలో ఈ కూటమి 160 వరకు స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఎన్‌డీఏలోని బీజేపీ 80 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అదేవిధంగా, మరో పెద్ద పార్టీ నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని జేడీయూ 70 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది.

కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో ఏర్పడిన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌(యూపీఏ) 76 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 32 శాతం మంది మళ్లీ నితీశ్‌కుమారే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. సీఎంగా నితీశ్‌ పనితీరు మంచిగా ఉందని 28.7 శాతం మంది తెలపగా మామూలుగా ఉందని 29.2%, బాగోలేదని 42.0% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 1–10 తేదీల మధ్య 243 నియోజకవర్గాలకు చెందిన 12,843 మంది నుంచి టెలిఫోన్‌ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ జరిపారు.  

రెబల్‌ అభ్యర్థులపై బీజేపీ వేటు: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుగుబాటు అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతలను బీజేపీ బహిష్కరించింది. మొత్తం 9 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో ఒకరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటుదారుల్లో చాలామంది బీజేపీ టికెట్‌ దక్కకపోవడంతో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నారు.

మరిన్ని వార్తలు