MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్‌ మల్లన్న

21 Mar, 2021 11:35 IST|Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన చింతపండు నవీన్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా... సిద్ధంకమ్మన్నదీ మన తెలంగాణలోన’అంటూ వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా మారారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సాధించిన ఓట్లపరంగా రెండో స్థానంలో నిలిచినప్పటికీ, చివరివరకూ అందరి దృష్టిని ఆకర్షించడంలో మాత్రం విజేతగా నిలిచాడు. జాతీయ పార్టీల అభ్యర్థులను, తెలంగాణ ఉద్యమంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ప్రొఫెసర్‌ను సైతం ఎలిమినేట్‌ చేసి, స్వతంత్ర అభ్యర్థిగా అధికారపార్టీ అభ్యర్థికి గట్టి సవాల్‌ విసిరి చర్చనీయాంశంగా మారారు.

పేదకుటుంబంలో పుట్టి.. పెద్ద చదువులు చదివి, పేపర్‌బాయ్‌గా పనిచేసే సమయం నుంచే జర్నలిజంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2015 ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన యూట్యూబ్‌ న్యూస్‌ చానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనవుతానన్న ఆయన, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యరి్థగా సత్తా చాటి చర్చల్లో వ్యక్తిగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పాదయాత్రలతో సమస్యలపై అవగాహన పెంచుకున్న ‘మల్లన్న’పట్టభద్రులకు దగ్గరవడమేకాక, ప్రభుత్వాన్ని ప్రతీ అంశంలోనూ ప్రశ్నిస్తూ వచ్చారు. 

1,650 కిలోమీటర్ల పాదయాత్ర.. 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానంపైనే పడింది. ఈ స్థానానికి అధికార, ప్రతిపక్ష పారీ్టలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా బలమైన వారే బరిలో దిగటంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి తీన్మార్‌ మల్లన్నగా సుపరిచితులైన చింతపండు నవీన్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా నిలిచారు. తనదైన శైలిలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు.

తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ అందరి దృష్టిని, ప్రత్యేకంగా పట్టభద్రులను ఆకర్షించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు విడతల్లో 1,650 కిలోమీటర్ల పాదయాత్రలో మల్లన్నకు అడుగడుగునా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ‘14 లక్షల ఉద్యోగాలిచ్చామని చెబుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అది నిజమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా’అంటూ సవాల్‌ చేసిన మల్లన్న, తానిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే రెండున్నరేళ్లలో ప్రజా రెఫరెండంకు సిద్ధంగా ఉంటానంటూ ప్రకటించి చివరివరకూ పోటీని రక్తికట్టించారు.
చదవండి:
కేసీఆర్‌ చాణక్యం: టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అంశాలివే.. 
అప్పులనే ఆదాయంగా చూపారా?.. హరీశ్‌

మరిన్ని వార్తలు