Tirath Singh Resign: అతి తక్కువ కాలం సీఎంలుగా పనిచేసింది వీళ్లే!

3 Jul, 2021 21:28 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్‌ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు.

ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్‌ సింగ్‌. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు...

దేవేంద్ర ఫడ్నవిస్‌- మహారాష్ట్ర
బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

బీఎస్‌ యడియూరప్ప- కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్‌- కాంగ్రెస్‌ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు.

జగదాంబికా పాల్‌- ఉత్తరప్రదేశ్‌
1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్‌. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్‌ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

హరీశ్‌ రావత్‌- ఉత్తరాఖండ్‌
ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్‌ రావత్‌. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే.

ఓం ప్రకాశ్‌ చౌతాలా- హర్యానా
ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత ఓం ప్రకాశ్‌ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.

నితీశ్‌ కుమార్‌- బిహార్‌
జనతా దళ్‌ నేత నితీశ్‌ కుమార్‌ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు