తిరుపతి ఉప ఎన్నిక: అత్యంత సంపన్న అభ్యర్థి ఆమే!

31 Mar, 2021 11:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తనకు మొత్తంగా రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కర్ణాటక చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఆమె, 2019-20 మధ్యకాలంలో తన ఆదాయం రూ. 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తన తల్లి నుంచి సంక్రమించిన బంగారు ఆభరణాల విలువ రూ. 52 లక్షలు అని తెలిపారు.

రత్నప్రభ ఆస్తి వివరాలు ఇలా..
మొత్తం ఆస్తి విలువ(భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి)- రూ. 25 కోట్లు
రత్నప్రభ సొంత ఆస్తులు- రూ. 19.7 కోట్లు
బ్యాంకు డిపాజిట్ల విలువ- రూ. 2.8 కోట్లు
బంగారు ఆభరణాల విలువ- రూ. 52 లక్షలు
చరాస్తుల విలువ- రూ. 3.5 కోట్లు
భూమి, భవనాలు, ఇళ్ల స్థలాలు, ఇతర స్థిరాస్తుల విలువ- రూ. 16.2 కోట్లు

ఇక తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్‌ చింతా మోహన్‌ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి(భర్త క్రిష్ణయ్యతో కలిసి ఉమ్మడి ఆస్తి) తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ ఎం. గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు భారీ ఎత్తున స్వతంత్రులు కూడా నామినేషన్‌ వేశారు.

చదవండి: బీజేపీ-జనసేన బంధానికి బీటలు! 
గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి

మరిన్ని వార్తలు