తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్‌?

25 Mar, 2021 19:39 IST|Sakshi

సమన్వయ కమిటీలో స్థానం లేదని గుర్రు

టీడీపీతో లోపాయికారి ఒప్పంద ఆలోచన

2019 ఎన్నికల్లో జనసేన కంటే నోటాకే అధిక ఓట్లు

తిరుపతి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్ర నేతలు క్షేత్ర స్థాయిలోకి దిగేసి రాజకీయ సమీకరణలకు తెర తీస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఆరు రోజులే గడువు ఉంది. అయితే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, జనసేన వైఖరి చూస్తుంటే బీజేపీ తప్పులు ఎత్తి చూపించి బయటపడి.. ఆంతరంగిక మిత్ర పార్టీ టీడీపీకి మద్దతుగా నిలవాలనే లోపాయికారి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి కంటే.. నోటాకే అత్యధిక ఓట్లు రావడం.. జిల్లాలో ఆ పార్టీ బలాన్ని తేటతెల్లం చేస్తోంది. 

సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రధాన పార్టీలు హడావుడి చేస్తుంటే.. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో స్నేహబంధాన్ని తెగదెంపులు చేసుకున్న జనసేన బీఎస్పీ పార్టీతో జతకట్టింది. ఎన్నికల తర్వాత ఎక్కడా ఆ పార్టీకి సరైన ఓట్లు రాకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో స్నేహబంధానికి తెర తీసింది.

ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్, తెలంగాణలో ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన జనసేన.. హఠాత్తుగా  ఆ పార్టీతో విభేదించి తెగదెంపులు చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించినట్లుగానే ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సహకరించలేదంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలల్లో మాత్రం కలిసి పనిచేస్తామని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఎన్నికల సమన్వయ కమిటీలో స్థానం కల్పించలేదని అసహనంతో జనసేన నేతలు ఊగిపోతున్నారు. ఈ పరిస్థితే ఇంకా ఒప్పందంపై ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. 

ఆంతరంగిక మిత్ర పార్టీతో.. 
తిరుపతి ఉప ఎన్నికల్లో ఆంతరంగిక మిత్ర పార్టీతో కలిసి పనిచేయాలనే చీకటి ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్‌ పరిధిలో జనసేన, బీజేపీ ఉమ్మడి కమలం అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం పొత్తు క్షేత్రస్థాయిలో పొడవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి రాని జనసేన నాయకులను పక్కన పెట్టి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఉప ఎన్నికల బాధ్యుల  కమిటీలో జనసేనకు చోటు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన జంప్‌ జిలానీలకు పెద్ద పీట వేసింది. ఈ   కమిటీలో చోటు ఇవ్వని కమలనాథులపై గ్లాసు నేతలు గుర్రుగా ఉన్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ జనసేనకు ఆహ్వానం కూడా లేదు. స్థానిక నేతలను కూర్చొ బెట్టుకొని మద్దతు ఇవ్వాలని కోరిన దాఖలాలు లేవు.

తమను చిన్న చూపు చూస్తున్న కమలనాథులతో జత కట్టలేమని తెగేసి చెప్పి పాత స్నేహ హస్తం అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన లోపాయికారికంగా పాత స్నేహం మనస్సులో పెట్టుకుని టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో అయితే టీడీపీతో జతకట్టడం కంటే నోటా వైపు మొగ్గు చూపితే బావుంటుందని ఆ నేతలు ఇప్పటికే రహస్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.   

బీజేపీకి ఆరో స్థానం
2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్‌ కూడా రాకపోవడం విశేషం.  

మరిన్ని వార్తలు