లోకేశ్‌ అసమర్థుడయ్యాడనే.. బాబులో తీవ్ర అసహనం

20 Oct, 2021 03:34 IST|Sakshi

అందుకే అసభ్యంగా మాట్లాడే వారిని రాష్ట్రం మీదకు వదిలారు

చంద్రబాబు చౌకబారు రాజకీయానికి తెరలేపారు

పట్టాభి వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి డీజీపీ కేసు నమోదు చేయాలి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపాటు

రెండున్నరేళ్లుగా ఎంతో సహనంతో ఉన్నాం

సీఎం జగన్‌ని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకోం

రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ అధినేత కుట్ర

సాక్షి, అమరావతి: తనయుడు లోకేశ్‌ చేతగాని, ఎందుకూ పనికిరాని అసమర్థుడయ్యాడన్న అక్కసుతోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబులో అసహనం పతాకస్థాయికి చేరుకుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఈ అసహనాన్ని ఆయన రాష్ట్ర ప్రజలపై ద్వేషంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అందుకే అసభ్యంగా మాట్లాడేవారిని రాష్ట్రం మీదకు వదిలి.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో నక్కా ఆనందబాబు, విశాఖలో అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మాట్లాడే విధానం ఉగ్రవాదుల దండు మాట్లాడినట్లు ఉందన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి అని సుధాకర్‌ ప్రశ్నించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఇలా మాట్లాడిస్తే ఇక ఎంతమాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని సుధాకర్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

బాబు క్షమాపణ చెప్పాలి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ సహేతుకమైన, అర్థవంతమైన విమర్శలు చేస్తే అర్థముంటుందని.. కానీ, అందుకు భిన్నంగా, ప్రతిరోజు ఒక సమూహంతో రాష్ట్రం నలుమూలలా ప్రెస్‌మీట్లు పెట్టించి ఉద్దేశ్యపూర్వకంగా నోటికి అడ్డూఅదుపు లేకుండా ముఖ్యమంత్రిని తిట్టిస్తున్నారని సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఈ రోజు సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన మాటలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. తక్షణమే బాబు క్షమాపణ చెప్పాలని.. సీఎం జగన్‌ను అరే అని.. బోషడికే అన్న వారి మీద సుమోటోగా డీజీపీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే, సీఎం జగన్‌పై ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏకవచనంతో తిట్టేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

టీడీపీ దుర్మార్గాలను వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు సహనంతో భరిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ విమర్శలు చేస్తే సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ, సీఎం జగన్‌ను ఉద్దేశించి నీచంగా మాట్లాడితే సహించబోమని స్పష్టంచేశారు. రెండున్నర ఏళ్లుగా ఇలా చేస్తున్నా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహనంతో ఉన్నాయని సుధాకర్‌ చెప్పారు. నిజానికి.. చంద్రబాబు ఒక స్క్రిప్ట్‌ రాసుకుని హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చారని.. పార్టీ ఆఫీసుకు రాకుండా ఇంట్లోనే ఉండి పట్టాభితో అసభ్య పదజాలంతో సీఎంను ఉద్దేశించి మాట్లాడించారన్నారు.

రాష్ట్రంలో అల్లకల్లోలానికి బాబు కుట్ర
రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా అల్లకల్లోలం చేయాలని బాబు కుట్ర పన్నారని సుధాకర్‌ ఆరోపించారు. చంద్రబాబు కూడా చాలా ఏళ్లు సీఎంగా ఉన్నారని.. పార్టీ అధికార ప్రతినిధులతో ఎలా మాట్లాడించాలో ఆయనకు తెలీదా అని ప్రశ్నించారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకుండా.. ఆయనతో క్షమాపణ చెప్పించకుండా పార్టీ ఆఫీసుకొచ్చి ఉద్రిక్త వాతావరణం సృష్టించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చౌకబారు రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. బాబు, లోకేశ్‌ డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలు సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని.. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తాము కోరుతున్నామన్నారు. పట్టాభి అసహ్యకర మాటలను చంద్రబాబు ఖండించకుండా బలగాల కోసం కేంద్ర హోంమంత్రికి ఫోన్‌ చేయటం ఏమిటన్నారు. సీఎం జగన్‌ ఏనాడు హింసకు ప్రోత్సహించలేదని సుధాకర్‌బాబు తెలిపారు.

జగన్‌ లాంటి నేతను ప్రజలు కోరుకుంటున్నారు
చంద్రబాబులో అసహనం ఎక్కువయ్యే పట్టాభి వంటి వారితో పదేపదే  సీఎం వైఎస్‌ జగన్‌ను, మంత్రులను కుక్కలు, పందులు అంటూ తిట్టిస్తున్నారన్నారు. అయినా.. ముఖ్యమంత్రి స్థాయిని బాబు ఇంచు కూడా తగ్గించలేరని తెలిపారు. 30 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి వాటిల్లో ఇళ్లు నిర్మిస్తున్న సీఎం జగన్‌ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా తలకిందులవుతుంటే, ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టే నాయకుడిని ప్రజలు జగన్‌లో చూసుకుంటున్నారని తెలిపారు.   

మరిన్ని వార్తలు