జగన్‌ను దళితులకు దూరం చేయాలని కుట్ర

30 Aug, 2020 05:26 IST|Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దళితులపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ను దళిత సమాజానికి దూరం చేసేందుకు ఆయన కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని ఆయన నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులను ఘోరంగా అవమానించిన చంద్రబాబును ఏ దళితుడూ నమ్మడని.. సీఎం జగన్‌పై బాబు అండ్‌ కో అడుగడుగునా కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా దళితులను దగా చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే దళిత సమాజం మీద కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కొన్ని కార్పొరేట్‌ శక్తులు యత్నిస్తున్నాయని తెలిపారు. దళితులపై దాడుల గురించి బాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 

► చంద్రబాబు దుష్ట సమూహంతో ఈ రాష్ట్రానికి చేటు. అంబేడ్కర్‌ను ఎంత ప్రేమిస్తామో.. సీఎం జగన్‌నూ దళితులంతా అలాగే ప్రేమిస్తారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నరోజే చంద్రబాబు దళితులకు శాశ్వత శత్రువుగా మారారు. దళితులపైన చంద్రబాబుది వ్యవస్థాపరమైన దాడి. దళితులపై ఎవరు దాడులకు పాల్పడినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. టీడీపీలో ఉన్న దళిత నేతలకు ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీయాలి.  
► 54 వేల మంది బడుగు, బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు? 
► దళితులపై దాడులు చేసిన వారిపై మా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది.  చంద్రబాబు హయాంలో జరిగిన  కారంచేడు సంఘటనను దళిత జాతి ఇంకా మరిచిపోలేదు.

మరిన్ని వార్తలు