కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే కృష్ణా జలాల్లో అన్యాయం

31 Jan, 2023 02:20 IST|Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం 

విభజన హామీలు నెరవేర్చాలని ఢిల్లీలో మౌనదీక్ష  

సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపారాలు, కేసుల నుంచి కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కృష్ణా జలాల పంపకం జరగలేదని అన్నారు.

కృష్ణా నది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే 78 శాతం ఉందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాలేదని ఆరోపిస్తూ... విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కోదండరాం నేతృత్వంలో 150 మంది టీజేఎస్‌ కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టారు.

దీక్ష అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాలు అందకపోతే హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి వస్తుందని అన్నారు. తెలంగాణలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దిండి, పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు కావాల్సిన నీటి వాటా లేకపోగా.. ఈ ప్రాజెక్ట్‌లను కేవలం వరద నీటిపై ఆధారపడి కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా కోసం ఇప్పటికైనా పోరాడాలని అన్నారు.   

మరిన్ని వార్తలు