బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు: టీఎంసీ

12 Oct, 2022 09:31 IST|Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే వార్తను వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షాను బీసీసీఐ సెక్రెటరీగా రెండో టర్మ్‌ కొనసాగిస్తూ గంగూలీకి అధ్యక్షుడిగా మరోమారు అవకాశం ఇవ్వకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. 

‘సౌరవ్‌ గంగూలీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు బెంగాల్‌ ప్రజల్లో ఓ వార్తను వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నాం. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని తెలిపారు ఘోష్‌. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మరోవైపు.. గంగూలీకి మద్దతు తెలిపారు టీఎంసీ ఎంపీ సాంతాను సేన్‌. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండాసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. 

ఖండించిన బీజేపీ.. 
సౌరవ్‌ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. బీసీసీఐ చీఫ్‌ మార్పుపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం టీఎంసీ మానుకోవాలని హెచ్చరించారు.

ఇదీ చదవండీ: Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..!

మరిన్ని వార్తలు