తృణమూల్‌లో ట్వీట్‌ చిచ్చు

12 Feb, 2022 06:20 IST|Sakshi

పార్టీలో యువ, పాత నేతల మధ్య వివాదం

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌లో ‘వన్‌ పర్సన్, వన్‌ పోస్ట్‌’ ట్వీట్‌ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్‌ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్‌ సన్నిహితులు అదితి, ఆకాశ్‌ ట్వీట్‌ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్‌ సూచిస్తున్నారు.

అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్‌ హకీమ్‌ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్‌నుంచి ఎవరో ఇదే ఈ్వట్‌ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి.   

అంతర్గత విభేదాలపై నేడు భేటీ
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, సెక్రెటరీ జనరల్‌ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్‌ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్‌ హకీం, అరూప్‌ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు