ఇంకెన్ని సార్లు అవమానిస్తారు..

6 Nov, 2020 14:24 IST|Sakshi

కోల్‌కత్తా : రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్‌ షా అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాలీ సంస్కృతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాతాలానికి తొక్కేస్తున్నారని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా అమిత్‌ షా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, స్వామీ వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి గొప్పగొప్ప మేధావులు జన్మించిన గడ్డ బెంగాల్‌ అని కొనియాడారు. సీఎం మమత బెంగాల్‌ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, బెంగాల్‌ వీరుల ఆశయాలకు వ్యతిరేకంగా పాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అమిత్‌ షా వ్యాఖ్యలపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘాటుగా స్పందించింది. బెంగాల్‌ సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఇతరుల చేత చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కౌంటరిచ్చింది. ఆ పార్టీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ సైతం ట్విటర్‌ వేదికగా అమిత్‌ షాకు బదులిచ్చారు. రాజకీయల లబ్ధి కోసం ఎన్నిసార్లు బెంగాల్‌ ప్రజల మనోభావాలను అవమానపరుస్తారని నిలదీశారు. తమ సంస్కృతిని అపహాస్యం చేసేలా ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు. ఈశ్వర్‌ చంద్రవిద్యాసాగర్‌, బీర్సాముండాల చరిత్ర గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. మమత నాయకత్వంలోని బెంగాల్‌ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు