‘తల్లికి నమ్మకద్రోహం చేస్తే.. అధోగతే’

30 Nov, 2020 20:47 IST|Sakshi

సువేందు వ్యాఖ్యలపై స్పందించిన అభిషేక్‌ బెనర్జీ 

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) సీనియర్‌ నాయకుడు, రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను  పైకి ఎదగడానికి లిఫ్ట్‌  ఉపయోగించలేదని, పార్టీ కార్యకర్తలే తన బలమని, పారాచూట్‌ ఉపయోగించి కిందికి రాలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ యూత్‌ వింగ్‌ చీఫ్, డైమండ్‌ హార్బర్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ తన నియోజకవర్గమైన సత్గాచియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో స్పందిస్తూ.. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ సభ్యులకు తల్లిలాంటిదన్నారు. పార్టీ సభ్యులు అంచెలంచెలుగా ఎదగడానికి, ప్రజల కోసం పని చేయడానికి ఆమె అవకాశం ఇచ్చారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగిస్తే అతను తల్లికి నమ్మకదోహం చేసినట్లా? కాదా? అని ప్రశ్నించారు. నమ్మకద్రోహం చేస్తే అది అతని పతనానికి నాందని ఆయన అన్నారు.  (చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!)
    
టీఎంసీ నిర్వహించిన రిజర్వేషన్‌ సమస్యల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో పట్టున్న నాయకుడు, ప్రముఖ ఎంపీ సౌగతా రాయ్‌తో సుబేందు రిజర్వేషన్లపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన వామపక్ష ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్‌ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి ఆయన వెన్నుముకగా నిలిచారు. అయితే కొంత కాలంగా టీఎంసీ పార్టీ కార్యకలాపాలకు సువేందు దూరంగా ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు