West Bengal: 43 మంది టీఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారం

10 May, 2021 12:50 IST|Sakshi

కోల్‌కత: ఇటీవల జరిగిన బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా ఆమె జంబో కేబినెట్‌ కొలువుదీరింది.  43 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణం చేశారు. బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమత పాల్గొన్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిలో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. మమత కేబినెట్‌లో చాలా మంది పాతమంత్రులు మళ్లీ బెర్తులను దక్కించుకోగా.. బంకిమ్‌ చంద్ర హజ్రా, రతిన్‌ ఘోష్‌, పులక్‌ రాయ్‌, బిప్లబ్‌ మిత్రాను పదవులు వరించాయి.

ఇక 2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న అమిత్‌ మిత్రా సైతం మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్‌ని సైతం మంత్రి (స్వతంత్ర) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌ మనోజ్‌ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు. 

కాగా, ఇటీవల వెలువడిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ జయభేరీ మోగించింది. తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకోగా బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ.. ఓటమి తప్పలేదు. అయితే, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం గమనార్హం.
(చదవండి: Tamil nadu: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే పోస్టర్లు)

మరిన్ని వార్తలు