Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా..

11 Jul, 2022 07:47 IST|Sakshi

కోల‍్‍కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు.

ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇద్రిస్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను గమనిస్తే మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.  పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారి మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని ఇద్రిస్ అలీ జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్‌ కూడా శనివారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితులు భారత్‌లో కూడా కన్పిస్తున్నాయని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారని వార్తలు వచ్చాక ఉదిత్ రాజ్ ఈమేరకు మాట్లాడారు.

రాహుల్ గాంధీ సైతం
మే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శ్రీలంకతో భారత్‌ను పోల్చిన ఆయన.. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోందని ధ్వజమెత్తారు.

శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయే కారణమంటూ ఆందోళనకారులు శనివారం ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఎవరికంటా పడకుండా పారిపోయారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారు పదవుల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.
చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన‍్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు

మరిన్ని వార్తలు