మోదీజీ.. మా గోడు వినండి

9 Aug, 2021 04:04 IST|Sakshi
రాజ్యసభలో మాట్లాడుతున్న డెరెక్‌ ఒబ్రియాన్‌

పెగసస్‌పై పార్లమెంటులో చర్చ జరగాలి

వీడియో విడుదల చేసిన రాజ్యసభ విపక్ష సభ్యులు

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్, రైతులపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారూ మా గోడు వినండి అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ డెరెక్‌  ఒబ్రియాన్‌ మూడు నిముషాలు ఉన్న ఒక వీడియోని ఆదివారం విడుదల చేశారు. రాజ్యసభ టీవీలో ప్రసారమైన దృశ్యాలు, విపక్ష నేతల వ్యాఖ్యలతో ఈ వీడియోను రూపొందించారు. ఇందులో సభ్యులు పెగసస్, రైతు సమస్యలపై చర్చకు పట్టుపట్టే దృశ్యాలు, వారు సభలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.

పెగసస్, రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ డిమాండ్లు ఏమిటో ప్రజలకు చేరడానికే సరికొత్త పంథాలో ఈ వీడియో విడుదల చేశామని ఒబ్రియాన్‌ ఈ సందర్భంగా చెప్పారు.  పార్లమెంటు ఉభయ సభల్లోనూ పెగసస్, రైతులు, స్పైవేర్‌ అన్న మాటలు ప్రతిధ్వనించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ వీడియోని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.‘‘ప్రధాని మోదీకి వణుకు పుడుతున్నట్టుంది. పార్లమెంటులో అడిగే ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు.

చర్చకు విపక్ష సభ్యులం సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ సభ్యులు అడ్డం పడుతున్నారు. ఫలితంగా నిజానిజాలేంటో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోతోంది’’అని ఖర్గే ట్వీట్‌ చేశారు.  కాంగ్రెస్, ఆర్‌జేడీ, టీఎంసీ, శివసేన, ఎస్పీ, టీఆర్‌ఎస్, ఆప్, డీఎంకే, వామపక్షాల సభ్యులు ఈ వీడియోలో ఉన్నారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఈ వీడియోలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా డిమాండ్‌ చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించి అయినా పెగసస్‌పై చర్చ జరిపి తీరాలన్నారు.

పార్లమెంటరీ కమిటీలోనూ బీజేపీయే అడ్డుపడుతోంది: శశిథరూర్‌  
ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలోనూ పెగసస్‌ చర్చకు బీజేపీ సభ్యులే అడ్డం పడుతున్నారని కాంగ్రెస్‌ నేత, కమిటీ చైర్మన్‌ శశిథరూర్‌ తెలిపారు.  గత జూలై 28న జరిగిన సమావేశంలో బీజేపీ పథకం ప్రకారం కోరం లేకుండా చేసి చర్చ జరగనివ్వలేదన్నారు.  సమావేశానికి హాజరైనప్పటికీ కొందరు సభ్యులు రిజిస్టర్‌లో సంతకాలు చేయలేదన్నారు.   ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమేనని మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు