Mahua Moitra: కాస్ట్‌లీ హ్యాండ్‌బ్యాగ్‌ ట్రోలింగ్‌పై స్పందించిన ఎంపీ: ‘ఫకీర్‌’ ‘జోలె’ అంటూ..

2 Aug, 2022 20:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు పార్లమెంట్‭ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల అంశంపై ఉభయ సభలు అట్టుడుకిపోతున్నాయి. విపక్షాలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభలో విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కకోలి ఘోష్‌ దస్తిదార్‌ ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమె పక్కనే ఉన్న మరో ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‭ను టేబుల్ కింద దాచేశారు. అంతే.. 

అధిక ధరల గురించి మాట్లాడుతున్నందునే ఆమె తన కాస్ట్‌లీ బ్యాగ్‭ను కనిపించకుండా పక్కన పెట్టారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ బ్యాగు లూయిస్ వియుట్టన్ కంపెనీ బ్రాండ్‌.  ధర రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. దీంతో రాజకీయంగానూ ఈ సీన్‌పై విమర్శలు మొదలయ్యాయి. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ సభ్యులు.. ఇలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు, మద్దతుదారులు వ్యంగ్యం ప్రదర్శించారు. ఆఖరికి మీమ్స్‌గానూ ఆమె వీడియో ట్రెండ్‌ అయ్యింది. ఈ తరుణంలో సోషల్‌ మీడియా సెటైర్లు, రాజకీయ విమర్శలపై ఆమె సింపుల్‌గా స్పందించారు.

జోలేవాలా ఫకీర్‌ను 2019 నుంచి పార్లమెంట్‌లో ఉన్నా. బ్యాగుతో వచ్చాం.. బ్యాగుతోనే వెళ్తాం అంటూ ట్వీట్‌ చేశారామె. అయితే ఆమె ట్వీట్‌లో లోతైన అర్థం దాగుండడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2016 యూపీ మోరాదాబాద్‌ పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓ ఫకీర్‌గా అభివర్ణించుకున్నారు. రాజకీయాల నుంచి ప్రత్యర్థులు తనను దూరం చేయాలని ప్రయత్నిస్తే.. సాదాసీదా వ్యక్తినైన తాను ఫకీర్‌లాగా జోలె పట్టుకుని ముందుకు వెళ్తానని.. అంతేగానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తాను ఆపబోనని భావోద్వేగంగా ప్రసంగించారు ఆయన.

మరిన్ని వార్తలు