West Bengal: అంకుల్‌ జీ అంటూ ​గవర్నర్‌పై ఆరోపణలు

7 Jun, 2021 16:09 IST|Sakshi

ఓఎస్‌డీలు గవర్నర్‌ బంధువులే అంటూ మహువా మోయిత్రా ఆరోపణలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్‌, తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మోయిత్రా మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు ట్వీట్ల ద్వారా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ.. మహువా ట్వీట్లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

ఇక తాజాగా తన ‘‘కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్‌భవన్‌లో ఓఎస్‌డీలుగా నియమించారు’’ అంటూ మహువా మోయిత్రా చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్‌ ధన్‌కర్‌ సోమవారం తోసిపుచ్చారు. రాష్ట్రంలో "భయంకరమైన శాంతిభద్రతల పరిస్థితి" నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై జగదీప్‌ ధన్‌కర్‌ ‘‘ఓఎస్‌డీలుగా నియమించిన ఆరుగురు వ్యక్తులు నా ​కుటుంబ సభ్యులు అంటూ మీడియాలో ప్రచారం చేయడం నిజంగా తప్పు. వారు నాకు బంధువులు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఈ ఓఎస్‌డీలు మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఎవరూ మా కుటుంబంలో భాగం కాదు. వీరిలో కనీసం ఒక్కరు కూడా నా సొంత రాష్ట్రానికి, కులానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

దీనిపై మ‌హువా వెంట‌నే స్పందించారు. వాళ్ల చ‌రిత్ర ఏంటో, వారిలో ఎవ‌రు.. ఎలా రాజ్‌భ‌వ‌న్‌లోకి వ‌చ్చారో వెంట‌నే చెప్పాల‌ని డిమాండ్‌ చేస్తూ మరో ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు కూడా ఈ విష‌యంలో మీకు ఏ సాయం చేయ‌లేర‌ని మోయిత్రా ఎద్దేవా చేశారు. అంతేకాదు మీకు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కూడా ద‌క్కుతుంద‌ని అనుకోవ‌డం లేదంటూ ట్వీట్ చేశారు.

చదవండి: బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం

మరిన్ని వార్తలు