రథయాత్ర వర్సెస్‌ బైక్‌ ర్యాలీ

6 Feb, 2021 04:28 IST|Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏప్రిల్‌/మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పదేళ్ల పాలనకు చెక్‌ పెట్టే లక్ష్యంతో బీజేపీ శనివారం నుంచి రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా మరో దఫా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) బైక్‌ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. నడియా జిల్లాలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జనసమర్థన్‌ యాత్ర పేరుతో సాగే ఈ ర్యాలీలో వేలాది మోటారుసైకిళ్లపై పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. అదేవిధంగా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా శనివారం నడియాలో పరివర్తన్‌ రథ యాత్రను ప్రారంభించనున్నారు.  రాష్ట్రంలో ఐదు దశల్లో ఈ యాత్ర, మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.  

బెంగాల్‌కు కేంద్ర బలగాలను పంపండి:
పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు, ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్రానికి కేంద్ర బలగాలను మాత్రమే పంపాలని బీజేపీ కోరింది. బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఈ మేరకు వినతి పత్రం అందజేసింది.  కేంద్ర ఎన్నికల పరిశీలకులకు రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం విధుల పర్యవేక్షణ బాధ్యతలనుఅప్పగించాలంది.

మరిన్ని వార్తలు