‘ఆపరేషన్‌ బెంగాల్‌’

7 Mar, 2021 02:43 IST|Sakshi

సిలి‘గురి’ ఎవరిది..? 

సీపీఐ(ఎం)కంచుకోటలో పాగాకు బీజేపీ నజర్‌ 

రెండోసారి గెలుపుపై టీఎంసీ ప్రణాళికలు సిద్ధం 

రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంపై రాజకీయ పార్టీల ప్రత్యేక దృష్టి 

బెంగాల్‌ కీ జాన్‌ ‘సిలిగురి’లో త్రిముఖ పోటీ

సాక్షి , న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి మొదలుకావడంతో ప్రచారం జోరందుకుంది. అధికారపీఠంపై కాషాయ జెండా ఎగరనీయకుండా అడ్డుకొనేందుకు దీదీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు మమతా బెనర్జీ దూకుడును ఆపేందుకు కమలదళం తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. సీపీఐ(ఎం) కంచుకోట సిలిగురిపై తమ జెండాలను ఎగురవేసేందుకు ఒకవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన సిలిగురి అసెంబ్లీ నియోజవర్గంపై ప్రతీ పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ 6 సార్లు, వామపక్షాలు తొమ్మిదిసార్లు, టీఎంసీ ఒకసారి విజయం సాధించింది. ఇప్పటివరకు సిలిగురిలో బీజేపీ ఇంకా బోణీ కొట్టలేదు.  

భిన్న రాజకీయ వాతావరణం.. 
ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి అసెంబ్లీతో సహా డార్జిలింగ్‌ జిల్లాలోని మొత్తం 5 స్థానాల్లో ఐదవ దశలో ఏప్రిల్‌ 5 న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సీటును ఎవరు ఆక్రమించుకుంటారనే అంశంపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 1951కి ముందు సిలిగురి, కుర్సేంగ్‌లతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. 1951 నుండి 2016 వరకు ఈ అసెంబ్లీ స్థానంలో  వామపక్షాల అభ్యర్థులు 9 సార్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 6 సార్లు గెలిచింది.  పశ్చిమ బెంగాల్‌లో మొదటి అసెంబ్లీ ఎన్నిక 1951 లో జరిగింది. అప్పుడు ఈ సీటు నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన టెన్జింగ్‌ వాగ్డి గెలిచారు. అయితే, 1957 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అప్పుడు సిపిఐ (ఎం) అభ్యర్థిగా సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి జరిగిన ఎన్నికల్లో సత్యేంద్ర నారాయణ్‌ మజుందార్‌ విజయం సాధించారు. 1962, 1967 ల్లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్‌ మళ్ళీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.  ఆల్‌ ఇండియా గూర్ఖా లీగ్‌కు చెందిన ప్రేమ్‌ థాపా 1969 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.  

అధికార మార్పిడి..: 1977 కి ముందు, సిలిగురిలో కాంగ్రెస్‌ తమ హవా కొనసాగించింది. 1977 లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది.  వామపక్షాలు అధికారాన్ని చేపట్టాయి. జ్యోతి బసు నాయకత్వంలో సిపిఐ (ఎం) బలమైన పార్టీగా అవతరించింది. 1977 ఎన్నికల తరువాత, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ హవా దాదాపుగా ముగిసింది. 1977 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తిరిగి రాలేకపోయింది. 1977, 1982 ల్లో సిపిఐ–ఎం అభ్యర్థి వీరెన్‌ బోస్‌ సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన 1987 ఎన్నికల్లో సిపిఐ(ఎం)కు చెందిన గౌర్‌ చక్రవర్తి విజయం సాధించారు. అనంతరం 1991 నుండి 2006 వరకు అశోక్‌ భట్టాచార్య సిపిఐ (ఎం) అభ్యర్థిగా వరుసగా నాలుగుసార్లు అధికారపీఠంపై కూర్చున్నారు. అప్పటి వామపక్ష ప్రభుత్వంలో అశోక్‌ భట్టాచార్య 20 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు.  

ఎత్తుకు పై ఎత్తులు..: అయితే, 2011 ఎన్నికల్లో అశోక్‌ భట్టాచార్య టీఎంసీ హవా ముందు నిలబడలేక ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. భట్టాచార్యను తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్‌ రుద్రనాథ్‌ భట్టాచార్య ఓడించారు. అయితే 2016 ఎన్నికల్లో అశోక్‌ భట్టాచార్య మళ్ళీ సిలిగురి అసెంబ్లీ సీటు నుండి విజయం సాధించారు. ఏప్రిల్‌ 7న జరుగబోయే ఐదో దశ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా బరిలో దిగనున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిలిగురి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు ఒకవైపు టీఎంసీ, బీజేపీ పోటీపడుతుండగా, మరోవైపు తమ పట్టును కొనసాగించేందుకు సీపీఐ(ఎం) ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు