West Bengal: మళ్లీ టీఎంసీలోకి వస్తాం.. వినతుల వెల్లువ!

10 Jun, 2021 06:54 IST|Sakshi

టీఎంసీకి మాజీ నేతల నుంచి వినతుల వెల్లువ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల్లో తృణమూల్‌ ఓటమి, బీజేపీ గెలుపు ఖాయమని నమ్మి కాషాయ కండువాలు కప్పుకున్న నాయకులంతా ఇప్పుడు ‘బ్యాక్‌ టు హోం’ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నాయకులు మళ్లీ మమత కరుణ కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరైతే బహిరంగంగానే ‘తప్పనిసరై’ బీజేపీలోకి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారు. ‘కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు సరికాదని రాష్ట్ర ప్రజలు సరైన, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన టీఎంసీ మాజీ మంత్రి రాజీవ్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. మళ్లీ తనను టీఎంసీలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సొనాలి గుహ కోరారు.  ‘ఒకవైపు, రాష్ట్రం కరోనాతో అల్లకల్లోలమవుతుంటే, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చేపట్టింది. నారద కేసులో టీఎంసీ నేతలను అరెస్ట్‌ చేసింది. అదే రోజు నేను బీజేపీని వదిలేశాను’ అని ఫుట్‌బాల్‌ మాజీ ఆటగాడు, బషిర్హట్‌ దక్షిణ్‌ ఎమ్మెల్యే దీపేందు బిశ్వాస్‌ మమతకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

టీఎంసీలోకి మళ్లీ వస్తామని బహిరంగంగా ఆకాంక్ష వ్యక్తం చేసిన నాయకుల్లో సరళ ముర్ము కూడా ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు టీఎంసీలో నెంబర్‌ 2 స్థాయి నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ మౌనం అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ విజయం ఖాయమైనప్పటి నుంచీ.. ఆయన నుంచి రాజకీయ ప్రకటనలేవీ రాలేదు. అయితే, బీజేపీలోనే కొనసాగుతానని ఒక ట్వీట్‌ మాత్రం చేశారు. ముకుల్‌ రాయ్‌ మళ్లీ టీఎంసీలోకి రాబోతున్నారనే వార్తలు ఇటీవల ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ కోవిడ్‌తో బాధపడుతున్న ముకుల్‌ రాయ్‌ భార్య కృష్ణను ఇటీవల కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తరువాత, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ ఆసుపత్రికి వెళ్లడం, ఆ మర్నాడే ప్రధాని మోదీ ముకుల్‌ రాయ్‌కు ఫోన్‌ చేసి పరామర్శించడం వెంటవెంటనే జరిగాయి. కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం ముకుల్‌ రాయ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు