Tamil Nadu: కలైంజ్ఞర్‌కు స్మారక మండపం.. కొత్త కార్పొరేషన్లు..

25 Aug, 2021 15:01 IST|Sakshi

రూ.39 కోట్లతో చెన్నైమెరీనా బీచ్‌లో నిర్మాణం 

అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ వెల్లడి 

పార్టీలకు అతీతంగా  ముక్తకంఠంతో హర్షధ్వానాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రానికి నిరుపమాన సేవలందించిన దివంగత ముఖ్యమంత్రి, కలైంజ్ఞర్‌ కరుణానిధికి ఘనమైన స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చెన్నై మెరీనాబీచ్‌లో రూ.39 కోట్లతో ఈ స్మారకమండపాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ మేరకు మండపం నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థలు, రాయితీల కోర్కెల పై చర్చతో అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.

సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘‘తమిళ సమాజాభివృద్ధి, శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడిన కరుణానిధి గురించి చేయబోయే ప్రకటనతో నేనే కాదు, ఈ ప్రభుత్వమే గర్వపడుతోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళులు గౌరవాన్ని పెంపొందించేలా ఆయన వ్యవహరించారు. దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచిన రాజకీయ మేధావి. తమిళనాడు అసెంబ్లీకి మమ్మల్నంతా శాశ్వత సభ్యులుగా అందించిన ధీశాలి. కోట్లాది ప్రజల హృదయాల్లో తోబుట్టువుగా మారారు.

సినీ పరిశ్రమతో 70 ఏళ్ల అనుబంధం, జర్నలిస్టుగా 70 ఏళ్ల జీవితం, 60 ఏళ్లపాటూ ఎమ్మెల్యే, డీఎంకే అధ్యక్షునిగా 50 ఏళ్ల పాలన, 13 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు కరుణానిధి. విజయం ఆయనను వీడలేదు, ఓటమి ఆయనను తాకలేదు. 1969లో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత మొత్తం ఐదుసార్లు రాష్ట్రాన్ని పాలించారు. జార్జికోట(సచివాలయం)లో కూర్చున్నా గుడిసెవాసుల గురించి ఆలోచిస్తుంటానని నిరూపించిన ప్రజా నాయకుడు.

తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలకు అలుపెరుగని సేవ చేశారు. ప్రస్తుతం మనమంతా అనుభవించి, ఆస్వాదించే ఆధునిక తమిళనాడు కరుణానిధి కృషి ఫలితమే. కరుణానిధి గొప్పదనం గురించి ఇలా ఎన్నిరోజులైనా చెప్పుకుంటూ పోవచ్చు. ప్రజల కోసం జన్మించి, వారి సంక్షేమం కోసమే తుదివరకు పోరాడి అలసిపోయిన కరుణానిధి శాశ్వత విశ్రాంతి కోసం 2018 ఆగస్టు 7వ తేదీన తనువు చాలించారు.

ఇలా తనను తాను తమిళనాడుకు అర్పించుకున్న ఆ మహానేత కరుణానిధిని నిరంతరం స్మరించుకోవడమే అసలైన నివాళి.   అందుకే చెన్నై మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధివద్ద 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.39 కోట్లతో స్మారకమండపాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది..’’ అని ప్రకటించారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉపనేత ఓ పన్నీర్‌సెల్వం, మంత్రులు, విపక్షాల సభ్యులు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ, పత్రిక, సినీ, సాహిత్యరంగాల్లో విశేషఖ్యాతి గడించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సరైన గౌరవమని కొనియాడారు. 

చదవండి: Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!

కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రకటన
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ‘ప్రమోషన్‌’ దక్కింది. స్థానిక సంస్థల అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో చెన్నై పల్లవరం డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి మాట్లాడారు. చెన్నై నగర శివార్లకు స్థాయి పెంపు హోదా కల్పించాలని కోరారు. తాంబరంను మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తున్నట్లు అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తాంబరం, పల్లవరం, చెంబాక్కం, పమ్మల్, అనకాపుత్తూరు మునిసిపాలిటీలను, వాటి పరిధిలోని పంచాయతీలను ఒకటిగా చేసి తాంబరానికి కార్పొరేషన్‌గా స్థాయిని పెంచుతున్నట్లు పేర్కొంది.

అదే విధంగా కాంచీపురం, కుంభకోణం, కరూరు, కడలూరు, శివకాశీలను సైతం కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. పల్లపట్టి, తిట్టకుడి, మాంగాడు, కున్రత్తూరు, నందిగ్రామం, గుడువాంజేరీ, పొన్నేరి, ఇడంగనశాలై, తారామంగళం, కోట్టకుప్పం, తిరునిన్రవూరు, శోలింగనల్లూరు, తారమంగళం, కూడలూరు, కారమడై, వడలూరు, తిరుక్కోయిలూరు, ఉళుందూరపేట్టై, సురండై, కలక్కాడు, అదిరామపట్టినం, మానమధురై, ముసిరి, కరుమత్తంపట్టి, మధుకరై, లాల్‌గుడి, కొల్లన్‌కోడును పురపాలక స్థాయికి పెంచుతున్నారు. పుగళూరు, టీఎన్‌పీఎల్‌ పుగళూరులను విలీనం చేసి పుగళూరు మునిసిపాలిటీలుగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

చదవండి: MK Stalin: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్‌ నిర్ణయాలు! 

మరిన్ని వార్తలు