తమిళనాడులో హిజాబ్‌ సెగ.. హిజాబ్‌లో మహిళను అడ్డుకున్న బీజేపీ బూత్‌ ఏజెంట్‌.. కౌంటర్‌ రియాక్షన్‌ ఇది

19 Feb, 2022 15:31 IST|Sakshi

Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్‌ లోకల్‌ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్‌ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్‌ సెగ తమిళనాడుకు పాకింది. 


కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్‌ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్‌ ఏజెంట్‌ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్‌ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్‌ ఏజెంట్ వీరంగం సృష్టించాడు‌. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్‌నిధి స్టాలిన్‌ స్పందించాడు.  

బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్‌నిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె.  

ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్‌ లోకల్‌ బాడీ పోల్స్‌ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్‌.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్‌ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్‌ స్టేషన్‌లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్‌ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు కమల్‌ హాసన్‌ తెయ్‌నామ్‌పేట్‌లో, తెలంగాణ గవర్నర్‌ తమిళసై,  తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నీలాన్‌గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్‌ ఫేజ్‌లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్‌ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

సంబంధిత వార్త: హిజాబ్‌ వివాదం.. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

మరిన్ని వార్తలు