ఇద్దరు సీనియర్ల మరణం.. సానుభూతి ఎవరికి?

13 Oct, 2020 10:33 IST|Sakshi

సానుభూతిపై అన్ని పార్టీల ఆశలు 

దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ  వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి  కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు  అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన  పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  

సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్‌లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!)

అనుకూలంపై అంచనా.. 
ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడుగా  పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి  1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్‌ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్‌ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్‌ కౌంటర్‌)

వరుస ఓటమి చవిచూసినా..  
వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్‌ఎస్‌లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్‌!)

ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు.. టీఆర్‌ఎస్‌ వద్దు 
ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు.. టీఆర్‌ఎస్‌ వద్దు.. కాంగ్రెస్‌ ముద్దు అంటూ  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఏస్‌ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు.  ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టవద్దని కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్‌ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్‌ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్‌ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు  రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు.
  
చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. 
దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు