సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం! ఆడబిడ్డ కంటతడి పెడితే మంచిది కాదు

2 Nov, 2022 09:19 IST|Sakshi
మునుగోడు సభకు హాజరైన మహిళలు. (ఇన్‌సెట్‌లో) కంటతడి పెడుతున్న స్రవంతి 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో... సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు. ఆడబిడ్డను కంటతడి పెట్టనీయకండి. నిండు మనసుతో ఆడబిడ్డను ఆశీర్వదించి ఉప ఎన్నికల్లో గెలిపించండి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి చనిపోయాక ఆయన భార్య బయటికి రాలేదని, ఇప్పుడు వారి బిడ్డ స్రవంతిని ప్రజల చేతుల్లో పెట్టడానికి ఆమె ఇక్కడికి వచ్చారన్నారు.

ఇప్పటి నుంచి స్రవంతి నియోజకవర్గ ప్రజల బిడ్డ అని చెప్పారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో రేవంత్‌ మాట్లాడారు. ఇప్పుడు స్రవంతిని గెలిపిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది మహిళలకు టికెట్లు ఇస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు.

ఆ నలుగురిలో స్రవంతి కూడా ఉంటుందని చెప్పారు. స్రవంతిని గెలిపిస్తే మునుగో­డును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చా­రు. ఈ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్య­త్‌ను మార్చబోతోందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిన మోసం, కేసీఆర్‌ చేసిన ధోకాపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. 

కేసీఆర్‌ను పాతిపెట్టండి
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరికీ రాని అవకాశం ఇక్కడి ప్రజలకు వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను మోసం చేసి నట్టేట ముంచి ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కేసీఆర్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు.

గుజరాత్, ఢిల్లీ నుంచి తెచ్చిన సీసాలు, నోట్ల కట్టలతో ఓట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. రూ.400 ఉన్న సిలిండర్‌ ధర రూ.1,100 ఎందుకు అయిందని బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని 2014లో ఎమ్మెల్యేగా గెలిíపించినా మును­గోడుకు జూనియర్‌ కాలేజీ కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. కిష్టరాయి­నిపల్లె, చర్లగూడెం, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. రాజగోపాల్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి కొత్తవారేం కాదని, వారి రంగు ఏంటో అందరికీ తెలుసని చెప్పారు.

ఒక్క అవకాశం ఇవ్వండి: స్రవంతి
ప్రజలందరి ఆదరాభిమానాలతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దిగానని, అడుగడుగునా ఒక ఆడబిడ్డను టీఆర్‌ఎస్, బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ‘మా తండ్రి సహకారంతోనే రాజకీయంగా ఎదిగిన వారు నన్ను మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడుపోయారు. నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు. కేవలం నా తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే పోటీచేస్తున్నా’ అని చెప్పారు.

ఒక్కోసారి తాను అలిసిపోయానని అనిపిస్తుందంటూ స్రవంతి కంటతడి పెట్టారు. ఇది స్రవంతి ఎన్నిక కాదని, బడుగు బలహీన వర్గాల ఎన్నికని, ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రంజితా రంజన్‌ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి మహిళలు తమ శక్తిని చాటాలన్నారు. ఈ సభలో తమిళనాడు ఎంపీ జ్యోతిమణి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు