కేసీఆర్, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేస్తేనే.. యువతకు ఉద్యోగాలు

30 Sep, 2021 01:19 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్య

కేసీఆర్‌ ఒక్కో నిరుద్యోగికి రూ. లక్ష బాకీ.. మాతో విద్యార్థులు, నిరుద్యోగులు కలసిరావాలి 

అక్టోబర్‌ 2 నుంచి విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లను వారి ఉద్యోగాల నుంచి బర్తరఫ్‌ చేసినప్పుడే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన తాము ముందుండి పోరాడతామని, ప్రభుత్వం పేల్చే తూటా, విసిరే లాఠీలను ఎ దుర్కొని నిలబడతా మని చెప్పారు. తమ ఉద్యమానికి విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, బెల్లయ్య నాయక్, హర్కర వేణుగోపాల్, కైలాశ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై ఆఖరి పోరాటంలో భాగంగా ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్‌ 2 నుంచి తెలంగాణ ప్రజలకు పవిత్రరోజైన డిసెంబర్‌ 9 వరకు ఈ ఉద్యమాన్ని 65 రోజులపాటు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రం తెచ్చుకుంది దీనికేనా? 
అక్టోబర్‌ 2న దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌరస్తా నుంచి ఎల్బీనగర్‌లో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం వరకు ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ చేస్తామని రేవంత్‌ చెప్పారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. 65 రోజుల కార్యాచరణలో భాగంగా మండల, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని, అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తామని తెలిపారు. కేసీఆర్‌ అధికారంలో వచ్చే నాటికి ఖాళీగా ఉన్న 1.10లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, అప్పటి నుంచి రిటైరైన పోస్టులను కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. పీఆర్సీ నివేదికలోనే 1.91 లక్షల ఖాళీలు ప్రకటించారని, వెంటనే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్‌ డిమాండ్‌ అన్నారు.

అదే విధంగా నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీ కింద ఇచ్చిన నెలకు రూ.3,016 భృతిని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి 30 నెలలవుతోందని, ఈ 30 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి భృతి కింద కేసీఆర్‌ బాకీ పడ్డ రూ.లక్ష రూపాయలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద బకాయి పడ్డ రూ.4వేల కోట్లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది సన్నబియ్యం, చేపపిల్లలు, గొర్రెలు, బర్రెల కోసం కాదని పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, ఆదివాసీల బిడ్డలు కూడా కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకునేందుకని చెప్పారు. రాష్ట్రంలో రాచరిక పాలన నుంచి విముక్తి కలిగించి, ఆ పోకడలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టేందుకే ఈ జంగ్‌సైరన్‌ కార్యాచరణ ప్రకటించామన్నారు.

మా వ్యూహం మాకుంది 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్‌ సమాధానమిస్తూ ఈ ఎన్నికల్లో తమ వ్యూహం తమకుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అభ్యర్థి ఎవరనేది కమిటీ చూసుకుంటుందని, రెండు రోజుల్లో మంచి వార్త చెపుతామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని, అయితే కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ తాము ప్రజల పక్షాన రాష్ట్రంలో బంద్‌ చేస్తుంటే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో విందు చేశారని ఎద్దేవా చేశారు. తాను గులాంగిరీ చేస్తున్న రాజులు అమిత్‌షా, మోదీలకు సామంతరాజు హోదాలో కప్పం కట్టేందుకే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు తప్ప రాష్ట్రానికి 5 పైసల ప్రయోజనం కూడా లేదని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు