వరదలో జనం పాట్లు.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ బిజీ 

17 Jul, 2022 00:42 IST|Sakshi
కత్తి కార్తీక చేరిక సభలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో మధుయాష్కీ తదితరులు 

కత్తి కార్తీక చేరిక సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటుంటే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశ రాజకీయాలంటూ, తామే మూడోసారి అధికారంలోకి వస్తామంటూ చిల్లర వ్యవహారాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌(టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీ వీ యాంకర్‌ కత్తి కార్తీక శనివారం రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ ‘వర్షాలు, వరదలపై మే నెలలోనే ఆయా శాఖలతో, మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సి ఉంది, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి గతంలో నిరంతరం ముఖ్యమంత్రులు పర్యవేక్షించేవారు. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం జాతీయ రాజకీయాలంటూ టైమ్‌పాస్‌ వ్యవహారాలు చేశారని ఆరోపించారు. అద్భుత ఇంజనీర్‌ అని ప్రచారం చేసుకున్న కేసీఆర్‌ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని రేవంత్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఏ ఒక్క పంప్‌హౌస్‌ అయినా మునిగిందా అని ప్రశ్నించారు. పంప్‌హౌస్‌లను కమీషన్ల కోసం కట్టి, నిర్వహణను గాలికొదిలేశారని ఆరోపించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ లో కలుషితమైన తిండి వల్ల 800 మంది విద్యార్థులు రోగాల బారిన పడితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని, మంత్రులు కేటీఆర్, హరీశ్‌ ఎక్కడున్నా బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. వరదల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల పంట మునిగిపోయిందని నివేదికలు చెబుతున్నా మంత్రి కేటీఆర్‌కు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

వరదల్లో చిక్కుకున్న 
కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధు ల నుంచి రూ.2 వేల కోట్లు రాష్ట్రానికి ప్రధాని మో దీ ప్రకటించేలా చూడాలని రేవంత్‌ రెడ్డి కోరారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ని అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుందని, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్‌దే అని ప్రచా ర కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ని బొంద పె డదామని, కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని కత్తి కార్తీక తెలిపారు. 

మరిన్ని వార్తలు