ఈటలకు ఆ విషయం ఆలస్యంగా అర్థమైంది

27 Jan, 2023 02:17 IST|Sakshi

బీజేపీలో కూడా కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారనే విషయం తెలిసి వచ్చింది

పొంగులేటితో భట్టి మాట్లాడుతున్నారు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎన్నికల్లో పోటీ వయసును తగ్గిస్తాం

మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో కూడా కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారనే విషయం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కొంత ఆలస్యంగా అర్థమైందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ లక్ష్యం కోసం రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లారో అది అక్కడ నెరవేరడం లేదన్న విషయం ఆయన మాటల్లో స్పష్టమవుతోందని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఇతర నాయకులతో కలసి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

కేసీఆర్‌ను గద్దెదించాలన్న లక్ష్యంతో ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారని, కానీ బీజేపీలోకి వెళ్లాక ఈటలకు అక్కడ కూడా కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని అర్థమైందని, దీంతో తన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చిందని అన్నారు. రాజేందర్‌కు ఇష్టం లేని పనులను కేసీఆర్‌ చేయిస్తున్నారన్నారు.

లెఫ్టిస్ట్‌ అయిన రాజేందర్‌ను బీజేపీలోకి వెళ్లేలా చేశారని, హుజూరాబాద్‌లో డబ్బులు పంచేలా చేశారని పేర్కొన్నారు. రాజేందర్‌తో పాటు బీజేపీలో చేరిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని అన్నారు. ఈటల, వివేక్, విశ్వేశ్వర్‌ రెడ్డి.. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని, కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారని చెప్పారు. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.

పొంగులేటితో చర్చలు..
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, పార్టీ అధిష్టానం భట్టికి ఆ బాధ్యతను అప్పగించిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామని, శాసనసభకు పోటీ చేసే వయసును 25 సంవత్సరాల నుంచి 21కి తగ్గిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ, కమ్యూనిస్టులు కేసీఆర్‌కు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఈటల ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని అన్నారు.  

మరిన్ని వార్తలు