కేసీఆర్‌ది.. అబద్ధాలు, అవినీతి, మోసాల పాలన 

14 Sep, 2022 02:48 IST|Sakshi
 మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. చిత్రంలో గీతారెడ్డి, నదీమ్, స్రవంతి  

ఎనిమిదేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు 

నల్లధనం వెనక్కి తెస్తానన్న మోదీ విఫలమయ్యారు 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ విమర్శ

చౌటుప్పల్‌ రూరల్‌: అబద్ధాలు, అవినీతి, మోసాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన చేస్తున్నారని.. 48 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. 30 మంది చనిపోయినా కనికరంలేని మనస్తత్వం ఆయనదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దామెరలో మంగళవా రం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మునుగోడు నియో జకవర్గంపై కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపాడని, డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటికే ప్రతి ఎకరాకు సాగు నీళ్లు అందేవన్నారు. కేసీఆర్‌ 3 జంతువుల కలయిక అని.. అవసరాన్ని బట్టి కుక్కలా, నక్కలా, తొడేలులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇచ్చిన పరిహారమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల రైతులకివ్వడానికి అక్కడ దేవుళ్లు, నల్లగొండను రాక్షసులేం పాలించడం లేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ కూడా మూడు నల్ల చట్టాలను తెచ్చారని, వాటిని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్‌ పోరాటం చేసిందన్నారు.

నల్లధనం వెనక్కి తెస్తానని, ప్రతి పేదోడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ కూడా ఇంత వరకు 15పైసలు కూడా వేయలేదన్నారు. అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వని, కమ్యూనిస్టులు ఎక్కడున్నారన్న కేసీఆర్‌కు సీపీఐ, సీపీఎం ఎందుకు మద్దతు ఇస్తున్నాయో తెలియడం లేదన్నారు. కమ్యూనిస్టులంతా ఉప ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం పనిచేయాలని కోరారు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే, ప్రజాస్వామ్యం బతుకుతదని, మేధావులు, నిరుద్యోగులు, యువత ఆలోచన చేయాలని రేవంత్‌ కోరారు. మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావేద్, గీతారెడ్డి, పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు