బీసీ కులగణనతోనే సామాజికన్యాయం

12 Oct, 2021 02:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేలితేనే ఆయా కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో సామాజికన్యాయం జరగాలంటే బీసీ కులాల జనగణన చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో బీసీల జనగణనపై అఖిలపక్ష సమావేశం జరిగింది.

టీపీసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం, ఎం.వి.రమణ(సీపీఎం), బాలమల్లేశ్‌(సీపీఐ), సంధ్య(న్యూడెమోక్రసీ)లతోపాటు ప్రొఫెసర్‌ మురళీమనోహర్, ప్రొఫెసర్‌ తిరుమలి, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని, వారి జనాభా లెక్కలు చెప్పాలని అడగడంలో న్యాయం ఉందని అన్నారు.

వన్‌నేషన్‌–వన్‌ సెన్సెన్‌ విధానాన్ని తీసుకురావాలని కోరారు. మన రాష్ట్రంలో కులాలవారీగా లెక్కలు తీసిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. వెంటనే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. జనగణన కోసం బీసీలు చేపట్టే ఏ ఉద్యమానికైనా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రేవంత్‌ హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ మాట్లాడుతూ  తెలంగాణ వచ్చాక బీసీలు వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు.  ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం మాట్లాడుతూ బీసీ జనగణనపై రాష్ట్రపతికి అన్ని పార్టీల పక్షాన లేఖ రాయాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉత్తరాల ఉద్యమం  చేపట్టాలన్నారు. కాగా, అఖిలపక్ష భేటీలో భాగంగా వెంటనే బీసీ గణన చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.    

మరిన్ని వార్తలు