రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా?

23 Jan, 2023 04:07 IST|Sakshi
నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌ నేతలు నాగం, మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌ రెడ్డి, సంపత్, షబ్బీర్‌ అలీ 

సీఎం ఇచ్చిన ధైర్యంతోనే దళితులు, ఎస్టీలపై బీఆర్‌ఎస్‌ నేతల దాడులు: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ కార్యకర్తలపై ప్రభుత్వ దౌర్జన్యం: మాణిక్‌రావ్‌ ఠాక్రే

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ’ సభ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ధైర్యంతోనే బీఆర్‌ఎస్‌ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మార్కండేయ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్‌ చేసిన దళితులు, గిరిజనులపై బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకోదన్నారు. రజాకార్లను తరిమికొట్టిన, ఆంధ్రా నాయకులను పొలిమేర దాటించిన వాళ్లం రేపు కేసీఆర్‌ను ఓడించలేమా? అని ప్రశ్నించారు. ఆదివా­రం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’లో రేవంత్‌ మాట్లాడారు.

దళితులకు కాంగ్రెస్‌తోనే అండతెలంగాణకు తొలి సీఎం దళితుడేనని చెప్పి దరిద్రపు సీఎం వచ్చారని.. అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి జరపని వ్యక్తి దళితుల పేరుచెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నారని రేవంత్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలమూరు బిడ్డ, ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను గొంతుమీద కాలుపెట్టి తొక్కడానికి ప్రయత్నిస్తే.. ఆయన బయటికొచ్చి దళిత బిడ్డల పౌరుషాన్ని చూపుతున్నారన్నారు. దొరలకు బీఆర్‌ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ అండగా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు. తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చామని, పంజాబ్‌కు దళితుడిని సీఎం చేశామని పేర్కొన్నారు.

మేం నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతాం
2018 ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని.. ఇప్పటివరకు తట్టెడు మట్టికూడా తీయలేదని రేవంత్‌ చెప్పారు. ‘‘ప్రాజెక్టు కట్టకుండా ఫాంహౌస్‌లో పడుకున్న సీఎంను ఈడ్చుకురావడానికే నాగం జనార్దన్‌రెడ్డి అక్కడికి పోయిండు. చేతనైతే ప్రాజెక్టు కట్టాలి్సందే. చేతకాకపోతే మీరు వచ్చాక కట్టుకోండి అని చెప్పి ఉండాల్సింది. కానీ ప్రాజెక్టుపై ప్రశ్నించిన గిరిజనుడు వాల్యానాయక్, దళితుడు రాములుపై దాడి చేస్తారా? వారి గొంతుపై కాలు పెట్టి తొక్కుతారా? దాడి చేసినవారికి ఈ ధైర్యం ఎక్కడిది. కేసీఆర్‌ నుంచే వచ్చింది.  భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకుంటుందా? 1,200 మంది శవాల పునాదుల మీద గద్దెనెక్కి ఇప్పుడు కాలుపెట్టి తొక్కుతారా? ఎన్నికలప్పుడు మా ఊరు, వాడ, బస్తీ, చెంచుపెంటలు, గూడెలకు వస్తావు కదా.. అప్పుడు నీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతాం..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

మేం కడితే.. మీరు ఫొటోలు దిగుతారా?
పాలమూరులో జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని రేవంత్‌ చెప్పారు. ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పూర్తిచేస్తే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాల్వల దగ్గర ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, మూడెకరాల భూమి, మాదిగ వర్గీకరణ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలపై సర్కారు దౌర్జన్యం: మాణిక్‌రావు ఠాక్రే
రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే మండిపడ్డారు. వాల్యానాయక్, రాములుపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల వికాసం, పేదలు, గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అన్నీ అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ తోడ్పాటుతోనే బీఆర్‌ఎస్‌ శ్రేణుల దుర్మార్గాలు: భట్టి
రాష్ట్రం వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత నాగం జనార్దనరెడ్డి కళ్ల ముందే దౌర్జన్యం జరిగిందని.. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దుర్మార్గాలకు ప్రభుత్వ సహకారమే దీనికి కారణమని మండిపడ్డారు. కాగా.. నాగర్‌కర్నూల్‌ సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, నదీమ్‌ జావేద్, నేతలు మల్లు రవి, షబ్బీర్‌అలీ, నాగం జనార్దనరెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రా>ములు నాయక్, శివసేనరెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ప్రీతం, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు జగన్‌లాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు