నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి.. చండూరు సభలో నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

5 Aug, 2022 20:25 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని.. మునుగోడు గడ్డ కాంగ్రెస్‌ పక్కన నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. జిల్లాలోని చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్‌ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది. కానీ, ఆ టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ త్యాగం గుర్తులేదా? అని రాజగోపాల్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మునుగోడులో చరిత్ర హీనుడైన రాజగోపాల్ రెడ్డి.. నమ్మిన కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పంచన చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి. అలాంటి సోనియాను హింసిస్తే ఊరుకుంటామా? అని రేవంత్‌ ఆగ్రహం వెల్లగక్కారు. 

కలిసి పోరాడేందుకు కాంగ్రెస్‌తో రాలేదని, కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్‌ షాను కలిశాడు. ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏదైనా ఊడిందా?. 2018 తర్వాత నాలుగు ఉప ఎన్నికల్లో రెండు టీఆర్‌ఎస్‌, రెండు బీజేపీలు గెలిచాయ్‌. ఒక ఎమ్మెల్యే పదవి పోయినా కాంగ్రెస్‌కు పోయేది ఏమీ లేదు. 

అందులో నొప్పేంటి? 
కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోదీ.. ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత్‌. నేను కాంగ్రెస్‌ తరపున పోరాడుతున్నా కాబట్టే నాపై కేసులు పెడుతున్నారు. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి కింద ఏం పని చేయాలని రాజగోపాల్‌రెడ్డి అంటున్నాడు. నేను 30 రోజులు జైల్లో ఉంటే.. అమిత్‌ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్‌షా పక్కన ఉన్నప్పుడు.. నా పక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చింది. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా?. ఉప ఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే ..కాంగ్రెస్‌ నుంచి పోటీ చెయ్‌. ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌నే రాజగోపాల్‌రెడ్డి మోసం చేశాడు. ఇవాళ కాంగ్రెస్‌ను మోసం చేసినవాడు.. రేపు మళ్లీ మోసం చేయడా?. తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయే సంస్కృతి కాదు.. సాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పైనే ఉంది. ప్రజలంతా కాంగ్రెస్‌ పక్కన నిలబడండి. నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతాం అంటూ ఆగ్రహం వెల్లగక్కారు రేవంత్‌రెడ్డి.

అంతకు ముందు కాంగ్రెస్‌ సీనియర్లు  భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌, జానా రెడ్డి, దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌, షబ్బీర్ అలీ, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సీతక్క తదితరులు మనుగోడులో కాంగ్రెస్‌ను గెలిపించాలని, పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.

చదవండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు-రేవంత్‌రెడ్డి
ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడను-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మరిన్ని వార్తలు