ఆ దేవుళ్లు ప్రగతి భవన్‌ ముందు కన్నీళ్లు పెడుతున్నారు

10 Jul, 2021 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరోనా సమయంలో స్టాఫ్‌ నర్సులను దేవుళ్లని పొగిడారని, ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్‌ ఎదుట కన్నీళ్లు పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘‘ ఉద్యోగాలు తొలగించి 1640 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రగతిభవన్‌కు వస్తే 5 నిమిషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా?.. ప్రగతిభవన్‌.. ప్రజల కష్టాలు విని కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా?..లేక కల్వకుంట్ల ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కార్యాలయమా?.

2018లో ఎంపికైన ఏఎన్‌ఎంలకు ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వట్లేదు. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్‌ 'వన్స్‌మోర్‌'గా ఉంది.. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, బిశ్వాల్‌ కమిటీ నివేదిక ఇస్తే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడమేంటి?. స్టాఫ్‌ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు