ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ 

13 Feb, 2023 01:20 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ డిమాండ్‌  

అశ్వాపురం: కాంగ్రెస్‌ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చే­యా­లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలని పీఎం, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్, చీఫ్‌ సెక్రటరీకి, మొయినాబాద్‌ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.

మొయినాబాద్‌ పోలీసులు ఇచ్చే నివేదిక, తమ ఫిర్యాదు ఫైల్‌ను సీబీఐకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి సీబీఐకి కేసు సమాచారం ఇవ్వకుంటే హైకో­ర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కేసీఆర్‌ అవినీ­తి, అక్రమాలతో పాటు పార్టీ ఫిరాయింపులే పనిగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తు­న్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్య­లు తీసుకోవాల్సిందిగా పీఎం, కేంద్ర హోం మంత్రి, సీబీఐ డైరెక్టర్‌కు లేఖలు రాయాలని కోరారు. లేదంటే కేసీఆర్‌తో వారు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందన్నారు.   

మరిన్ని వార్తలు