రోజూ రెండు గంటలు పనిచేస్తే గెలుపు కాంగ్రెస్‌దే

4 Sep, 2022 03:05 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో జానారెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు 

కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఆ మోదీకి లేదు.. ఈ కేడీకి లేదు

టీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం

ముఖ్యకార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్‌ విడుదల

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్‌కు 97 వేల ఓటు బ్యాంకు ఉందని, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాపాడుకుంటే పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే లక్ష ఓట్లు సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ‘ఆ మోదీకి లేదు.. ఈ కేడీకి లేదు’అని వ్యాఖ్యానించారు.

మునుగోడులో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్‌ రూపొందించిన చార్జిషీట్‌ను మాజీ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 100 రోజులపాటు మండలాల్లోని నాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్, బీజేపీ చేసిన మోసాలను పేర్కొంటూ రూపొందించిన చార్జ్‌షీట్‌ను, వరంగల్‌ డిక్లరేషన్‌ను వివరించాలన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ సర్వం చేసిందని, ప్రజలు ఆయనకు లక్ష ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తన రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయన్న రాజగోపాల్‌రెడ్డి.. ఒక్కో ఓటును రూ.2 లక్షలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తే సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు డబ్బులొచ్చాయి తప్ప ప్రజలకేం రాలేదని చెప్పారు.

అమ్ముడుపోయిన సన్నాసులకు మాత్రమే డబ్బులు వచ్చాయన్నారు. కమ్యూనిస్టులను చూస్తే జాలే స్తోందన్నారు. ‘మీ నాయకులను కొనుక్కొని, మీ పార్టీని బొందపెట్టిన టీఆర్‌ఎస్‌కు మీరు మద్దతిస్తారా’ అని ప్రశ్నించారు. విలీన దినోత్సవం పేరుతో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అదే పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.

అధికారికంగా నిర్వహిస్తాం 
ఇప్పటినుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకు కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి రైతాంగ సాయుధ పోరాటం చేసిన వారి చరిత్రను దేశానికి మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రమే రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు.

అక్రమ డబ్బుతో గెలవాలని చూస్తున్నారు: ఉత్తమ్‌
కాంట్రాక్టుల్లో వచ్చిన అక్రమ డబ్బుతో మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీ గెలవాలని చూస్తున్నాయని ఎంపీ ఉత్తమ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ను వదిలి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. డిండి, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి, బ్రాహ్మణవెల్లెం ఎత్తిపోతల పథకాలు, చౌటుప్పల్‌ డిగ్రీ కాలేజీ, మునుగోడులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలపై కేసీఆర్‌ హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. నల్లగొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మాజీ మంత్రి కె.జానారెడ్డి విమర్శించారు. ఈ భేటీలో మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ, యాదాద్రి డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు