‘తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది’

5 Oct, 2022 14:42 IST|Sakshi

హైదరాబాద్‌: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌(భారత్‌ రాష్ట్ర సమితి)గా పేరు మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు(బుధవారం) తీర్మానం చేయడంపై టీపీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2001 నుంచి 2022 వరకూ తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతం అయిన కేసీఆర్‌.. తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారని మండిపడ్డారు. ‘తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్‌. 

తెలంగాణ అనే పదం ఇక్కడిప్రజల జీవన విధానంలో భాగం. తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలి. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆర్‌ఎస్‌. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండి. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై  రాసి పెట్టండి. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా.  తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు రేవంత్‌రెడ్డి.

మరిన్ని వార్తలు