కాంగ్రెస్‌లో ‘నల్లగొండ’ కాక! 

29 Apr, 2022 04:12 IST|Sakshi

నేడు నాగార్జునసాగర్‌కు  వెళ్లనున్న పీసీసీ చీఫ్‌ 

రేవంత్‌ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్న కోమటిరెడ్డి 

జిల్లాలో పార్టీ బలంగా  ఉన్నందున వేరేచోట మీటింగ్‌ పెట్టుకోవాలని వ్యాఖ్య 

పార్టీలో హాట్‌ టాపిక్‌గా తాజా పరిణామాలు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ కాక మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న జిల్లా పర్యటనల్లో భాగంగా నల్లగొండ జిల్లాకు వెళ్తుండడం ఇందుకు కారణమయ్యింది. రేవంత్‌ నల్లగొండ పర్యటన ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, తాజాగా శుక్రవారం ఆయన నాగార్జునసాగర్‌కు వెళ్తుండడం, ఆయన పర్యటన గురించి టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేవంత్‌ నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ పార్టీ బలంగా ఉందని, ఉత్తమ్‌తో పాటు జానా, తాను అన్నీ చూసుకుంటామని, తామే అక్కడ పహిల్వాన్‌లమని కోమటిరెడ్డి గురువారం మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల సమీక్షలు పెట్టినా పెట్టక పోయినా రాహుల్‌ సభకు జనాలు వస్తారని, బలం గా లేని జిల్లాలకు వెళ్లి అక్కడి నేతలు, కార్యకర్తలను సిద్ధం చేయాలంటూ కోమటిరెడ్డి సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఉత్తమ్‌ ఓకే.. కోమటిరెడ్డి నో 
రేవంత్‌ను నల్లగొండకు రావద్దని నేరుగా చెప్పేందుకే కోమటిరెడ్డి అలా వ్యాఖ్యానించారని, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అంగీకరించేందుకు ఆయన లోలోపల ససేమిరా అంటున్నారని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమనే చర్చ జరుగుతోం ది. వాస్తవానికి, ఈ నెల 27న రేవంత్‌ నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకత్వంతో సమావేశం కావాల్సి ఉంది. కానీ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలతో చెప్ప కుండానే షెడ్యూల్‌ రూపొందించారనే కారణంతో కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడిందని గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మరోమారు పార్టీ నేతలతో మాట్లాడిన రేవంత్‌ తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకోవ డం గమనార్హం. ఈ సమావేశానికి హాజరు కావా లని ఉమ్మడి జిల్లాలోని నాయకులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి హుజూర్‌నగర్‌ నుంచి ర్యాలీగా సాగర్‌కు వెళ్లేందుకు నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కోమటిరెడ్డి మాత్రం ఈ సమావేశానికి తాను వెళ్లడం లేదని చెప్పడం చర్చకు తావిస్తోంది. తన నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమం ఉన్నందున తాను సాగర్‌కు వెళ్లడం లేదని కోమటిరెడ్డి చెప్పడం గమనార్హం. 

వెళ్లొద్దని ఎలా అంటారు? 
కోమటిరెడ్డి మనసులో ఏమున్నప్పటికీ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని రాష్ట్రంలో ఫలానా చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం భావ్యం కాదనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా రేవంత్‌ వెళ్లవచ్చని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర నేతలు కూడా.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను ఏఐసీసీ నియమించిన తర్వాత అన్ని జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే అధికారం ఆయనకు ఉంటుందని, దీన్ని అడ్డుకునేందుకు, అభ్యంతర పెట్టేందుకు ఎవరికీ అధికారం ఉండదని అంటున్నారు. మొత్తంమీద రేవంత్‌ నల్లగొండ పర్యటన, ఆ పర్యటన గురించి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.   

మరిన్ని వార్తలు