పదే పదే క్లీన్‌బౌల్డ్‌.. ఇంతకీ కాంగ్రెస్‌ వ్యూహమేంటి?

22 Nov, 2022 10:14 IST|Sakshi

హస్తం కిం కర్తవ్యం.?
ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేస్తారు.. ఇవి కాంగ్రెస్ రివ్యూల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ లేకుంటే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ నేతలు మధన పడుతున్నారట. ప్రజా సమస్యల పై ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చారట హస్తం నేతలు. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? 

ఉపఎన్నికల్లో క్లీన్‌ బౌల్డ్‌
వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ.. అవి ప్రత్యేక ఎన్నికలు అని సర్దిచెప్పుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ఎలాగైనా గెలవాలి అని కసరత్తు చేసినా డిపాజిట్ కోల్పోయి మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయింది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలపై అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది.

పేరుకే రివ్యూ.. జరుగుతోంది వన్‌ సైడ్‌ డ్రైవింగే
పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. గతం గతః ఇప్పటి నుండి ఏం చేయాలి అనే దానిపై తాజాగా మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారట.

టీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందని, కేసీఆర్ ఇచ్చిన పోడు భూములు, రుణమాఫీ, అసైన్డ్ భూములు ఇలా తదితర అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్దమవుతోంది. ఈ నెల 24న ఎమ్మార్వో కార్యాలయాల ముందు, 30న నియోజకవర్గాల్లో, డిసెంబర్ 5న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పీసీసీ ఛీఫ్  చీఫ్ రేవంత్ ప్రకటించారు.

బాబు.. బాగా బిజీ
పార్టీ కార్యాచరణ కోసం ఇటీవలే జూమ్ మీటింగ్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది గంటలు గడవకముందే మరోసారి గాంధీ భవన్‌లో అనుబంధ సంఘాలతో  మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగులో పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులపై రేవంత్ ఫైర్ అయ్యారట. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, దీన్ని అధిగమించాలంటే అందరం కలిసి పనిచేయాలని రేవంత్ దిశానిర్దేశం చేశారట. ఇప్పటివరకు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు  చేపట్టిన కార్యక్రమాల వివరాలేంటి, ఇకపై చేయబోయే కార్యక్రమాలేంటో తనకు పది రోజుల్లోగా తెలియచేయాలని రేవంత్ అడిగినట్లు సమాచారం. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, అందరం కలిసి బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలపై పోరాడాలని చెప్పాడట. 

చేప.. చేప.. ఎందుకు గెలవలేదు.?
ఇంత చేస్తే మునుగోడు ఓటమిపై మాత్రం పూర్తి సమీక్ష చేయలేదంటున్నారు. స్వయానా పీసీసీ చీఫే ఎన్నికలకు ముందుకు కాడి జారేశాడని, సిట్టింగ్‌ స్థానాన్ని సరైన వ్యూహం లేక పోగోట్టుకున్నారని గొల్లుమంటున్నారు. రేవంత్‌ తీరు వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొందరంటే.. పార్టీ నేతలే ఇక్కడికి తీసుకొచ్చారని అధిష్టానానికి రేవంత్‌ చెబుతున్నారట. 

మరిన్ని వార్తలు