-

వ్యూహాత్మక అడుగులు: వ్యతిరేకులు, సీనియర్లతో భేటీ

29 Jun, 2021 08:21 IST|Sakshi
తేనీటి విందుకు హాజరైన రేవంత్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు

పార్టీ నేతలను సమన్వయపరుస్తున్న కొత్త టీపీసీసీ చీఫ్‌ 

తనను వ్యతిరేకించిన వారిని, బలపరిచిన వారిని కలుస్తున్న రేవంత్‌ 

సమన్వయం కోసమే పదవీ స్వీకరణ పది రోజులు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సారథిగా కొత్తగా ఎంపికైన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు అధ్యక్షుడు కావడం, తన నియామకాన్ని కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే వ్యతిరేకించిన నేపథ్యంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన రోజే రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దాయన జానారెడ్డిని కలిసిన రేవంత్‌ పార్టీ నేతలందరితో సమన్వయమే ఎజెండాగా ముందుకెళ్తున్నారు.

ఇందులో భాగంగానే మాజీ మంత్రి పొన్నాల నివాసానికి, సీనియర్‌ నేత వి.హనుమంతరావును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. తనను వ్యతిరేకించిన వారిని, బలపరిచిన వారిని కలుస్తున్న రేవంత్‌ కొందరు నేతలకు ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. వారికి తగిన భరోసా కల్పిస్తున్నారు. ‘పార్టీలో అంతా సానుకూలమనే భావన తర్వాతే బాధ్యతలు స్వీకరిస్తా’అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీని కోసమే బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని పది రోజుల పాటు వాయిదా వేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

రోజంతా బిజీబిజీ... 
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి సోమవారం రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ నేతలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డితో పాటు సూరీడు కూడా ఆయన్ను కలిసి అభినందించారు. తర్వాత రేవంత్‌.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి కలిశారు. అనంతరం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును పరామర్శించారు. తన నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వీహెచ్‌ను కలవడం ద్వారా తనకు భేషజాల్లేవని చెప్పినట్టయిందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది.

అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. తర్వాత పీవీ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభకు హాజరయ్యారు. ఆ తర్వాత మాజీ ఎంపీ మల్లురవి నివాసానికి వెళ్లి టీపీసీసీ కొత్త కార్యవర్గానికి ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. సామాజిక కూర్పుతో టీపీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జూలై 7న ముందుగా రేవంత్‌.. పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటారని, తర్వాత నాంపల్లి ధర్గాలో పూజలు చేస్తారని మల్లు రవి చెప్పారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు వస్తారని.. కార్యకర్తలంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ప్యాసింజర్‌ రైలు డ్రైవర్‌ని... 
‘కాంగ్రెస్‌ చరిత్రలో 4 రోజులు అభిప్రాయసేకరణ జరిపి పీసీసీ అధ్యక్షుడిని నియమించడం ఇదే తొలిసారి. నేను సోనియా మనిషిని. నాకు చిన్న వయసులోనే, తక్కు వసమయంలోనే పెద్ద అవకాశమిచ్చారు. మాది కాంగ్రెస్‌ కుటుంబం. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. తర్వాత మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి వచ్చా. నాకెలాంటి భేషజాల్లేవు. ఓపెన్‌ మైండ్‌తో ఉన్నా. నిన్నటి వరకు చూసిన రేవంత్‌ వేరు.. ఇప్పుడు వేరు. అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తా. ఇప్పుడు నేను ప్యాసింజర్‌ రైలు డ్రైవర్‌ని. కాంగ్రెస్‌ పార్టీ గరక లాంటిది. ఎండకు ఎండినా చిన్న చినుకు పడితే పచ్చగా చిగురిస్తుంది’ అని ఆ తేనేటి విందులో రేవంత్‌ పేర్కొన్నారు. 

అతిపెద్ద దళిత ద్రోహి కేసీఆర్‌ 
హిమాయత్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గద్దె ఎక్కిన నాటి నుంచి నేటి వరకు దళితుల పట్ల ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని టీపీసీసీ కొత్త చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహుల్లోకెల్లా అతిపెద్ద దళిత ద్రోహి కేసీఆర్‌ మాత్రమేనని ధ్వజమెత్తారు. వీహెచ్‌ను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వంద మంది దళితులకు రూ.10 లక్షలిస్తే.. మిగతావారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి అంటూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లంటూ మోసానికి పాల్పడుతున్నారన్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరం కలసి సోనియా వద్దకు వెళ్దామని వీహెచ్‌ చెప్పినట్లు రేవంత్‌ వెల్లడించారు. 

చదవండి: Revanth Reddy: అంచెలంచెలుగా ఎదిగి.. అధ్యక్షుడిగా..

మరిన్ని వార్తలు