కవితను జైల్లో పెట్టి ఎన్నికలు గెలవాలని... 

24 Sep, 2023 02:15 IST|Sakshi

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి కొత్త డ్రామాకు తెరలేపారు: రేవంత్‌ రెడ్డి 

దిగజారుడు రాజకీయాలకు బీఆర్‌ఎస్, బీజేపీ కంకణం 

బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు వేరు కాదు 

టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్‌ కన్న కూతురిని కూడా జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి రెండు నెలలు జైలులో పెట్టి ఎన్నికలు గెలవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

వచ్చే నెలలో కవితను అరెస్టు చేసి తీహార్‌ జైలుకు పంపి.. అదే సానుభూతితో ఎన్నికల్లో గెలవాలన్న ప్రణాళికలో ఆ రెండు పార్టీలున్నాయన్నారు. రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కవితను అరెస్టు చేయడం పెద్ద డ్రామా అని.. దీని గురించి ఆలోచించొద్దని ప్రజలను కోరారు. ఆ మధ్య కేటీఆర్‌ ఢిల్లీ వచ్చి చీకట్లో అమిత్‌ షాను కలిసి వెళ్లారని.. ఆ తర్వాత ప్రణాళికను అమలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల చేశాక దానిపై ఎలాంటి చర్చ జరగకుండా ఉండేందుకు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం... ఢిల్లీకి పిలవడం.. అరెస్టు చేయడం.. లాంటివన్నీ చేసి తమ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ప్రచారం రాకుండా చూసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు వేర్వేరు కాదని.. ఈ మూడు పార్టీలు వేర్వేరు రూపాల్లో ఉన్నా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు వీళ్లందరిదీ ఒకటే కూటమి అని రేవంత్‌ చెప్పారు. 

కొత్త కమిషన్‌ను నియమించాలి 
గ్రూప్‌–1 పరీక్షల పేరుతో లక్షలాది మంది యువకుల జీవితాలతో చెలగాటమాడారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంతో హైకోర్టు ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు చేయడమనేది కేసీఆర్‌ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి అవమానమని అన్నారు. తక్షణమే టీఎస్‌పీఎస్సీని రద్దుచేసి పారదర్శకంగా కొత్త కమిషన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులకు, యువతకు బాసటగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అందరూ వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోకి వచ్చే ఇతర పార్టీల నాయకులకు వారి అనుభవానికి తగ్గట్టు వారికి అవకాశాలు ఇస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని కోరుకుంటున్నారని... కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం అనేది ప్రజలకు తక్షణ అవసరమని చెప్పారు.  

ముదిరాజ్‌లకు ఒక్క సీటు కేటాయించరా? 
‘ముదిరాజ్‌లు బీసీల్లో అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గం. బీఆర్‌ఎస్‌ వారికి కనీసం ఒక్కసీటైనా కేటాయించిందా? వాళ్లు తెలంగాణ ప్రజలు కారా? కేసీఆర్‌కు ఒక ముదిరాజ్‌ నాయకుడితో పంచాయితీ ఉండొచ్చు... అది వాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత వైరం.. అంతమాత్రాన మొత్తం ముదిరాజ్‌ల్లో కనీసం ఒక్కరికైనా ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎలా ఉంటారు? కురుమలకు కూడా ఒక్క స్థానాన్నీ ఇవ్వలేదు’అని రేవంత్‌ ప్రశ్నించారు.

ముదిరాజ్‌లు, కురుమలకు కాంగ్రెస్‌ న్యాయం చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా కాంగ్రెస్‌ జాబితా ఉంటుందని తెలిపారు. ఏదేనీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేకపోతే వారికే మొదట నామినేటెడ్‌ పదవులు ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు