గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ 

3 Sep, 2021 03:35 IST|Sakshi

టీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు 

వైఎస్సార్‌ వర్ధంతి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ..ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని టీపీపీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఏ ప్రాంతీయ పార్టీకి స్థలం కేటాయించలేదని, టీఆర్‌ఎస్‌కు మాత్రం కేటాయించడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ స్నేహానికి అద్దంపడుతోందన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తరఫున ఆయనకు ఘనంగా నివాళు లర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మోకాలి చిప్పలు అరిగినా.. ప్రధాని మోదీ దర్శనం కలగదని ఎద్దేవా చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజూ 3 టీఎంసీల కృష్ణా జలాల తరలింపునకు జారీ చేసిన జీవో 203 ప్రగతిభవన్‌లో తయారైందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో అక్కడి సీఎం జగన్‌ ప్రకటన చేసిన తర్వాత, కాంగ్రెస్‌ తరఫున నాగం జనార్దన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ధర్నాలు చేస్తే, సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని సంతకాలు చేశారని ఆరోపించారు.

వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాగా, డీసీసీ అధ్యక్షులతో జరిగిన జూమ్‌ సమావేశంలో ఈనెల 10 లోపు రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

>
మరిన్ని వార్తలు