‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’

22 Nov, 2020 17:49 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలమయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలే మింగేశారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్‌ మునిగిందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్‌కు ఒరిగిందేమీ లేదన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదు. తెలంగాణకు బీజేపీ ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. టీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని’’ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై ఉత్తమ్‌ ఆగ్రహం
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో పిల్లర్లకు టీఆర్ఎస్‌ కటౌట్లు పెడితే ఈసీ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ కటౌట్లు తొలగించనందుకు సిగ్గుపడాలని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఉత్తమ్‌ అన్నారు.

ఇప్పటికీ తొలగించలేదు: పొన్నం ప్రభాకర్‌
తమ నేతలు ఎస్‌ఈసీని కలిసి 24 గంటలు అయ్యిందని, ఇప్పటికీ ప్రభుత్వ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు తొలగించలేదని కాంగ్రెస్‌ నేత  పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మీరు చేయకుంటే మేం తమ కార్యకర్తలతో తొలగిస్తామని తెలిపారు. తాము శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించమని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా