ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎందుకు సోదాలు చేయలేదు: రేవంత్‌ ఫైర్‌

10 Sep, 2022 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. రాజకీయ నేతలు పొలిటికల్‌ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌, బీజేపీపై విరుచుకుపడ్డారు. 

కాగా, రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అకారణంగా ఉప ఎన్నిక తెచ్చాయి. టీఆర్‌ఎస్‌ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉంది. కేసీఆర్‌ను సంతోషపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుంది. ఇక్కడ ఏం చేయలేని వాడు.. దేశ రాజకీయాల్లో వెళ్లి ఏం చేస్తారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న మాయావతి, నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదు. బీజేపీకి మేలుచేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు బొమ్మా బొరుసు లాంటివి. 

దేవుడు నిమజ్జనానికి వచ్చిన వ్యక్తి రాజకీయాలు మాట్లాడడం ఏంటి?. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ గేమ్ ప్లాన్‌. వెస్ట్ బెంగాల్ ప్లాన్‌ను బీజేపీ, టీఆర్ఎస్ అమలు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంపై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో విచారణ చేయండి. ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తీయండి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇంట్లో ఇప్పటి వరకు ఎందుకు సోదా చేయలేదని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్‌లో ముసలం.. కేసీఆర్‌, కేటీఆర్‌కు లేఖలు

మరిన్ని వార్తలు