కేసీఆర్‌ బక్కోడు కాదు.. భూబకాసురుడు: రేవంత్‌ వ్యాఖ్యలు

23 Nov, 2023 16:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు దుబ్బాక నిధులను రద్దు చేసి సిద్దిపేటకు తరలిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బక్కోడిని అని చెప్పి కోట్ల రూపాయలు మింగాడు. కేసీఆర్‌ భూబకాసురుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దుబ్బాకలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మామ కేసీఆర్, అల్లుడు హరీశ్ రావులకు ఇక్కడి నిధులను సిద్దిపేటకు తరలించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మనకు నిధులు ఇవ్వడం లేదని ఇక్కడి ప్రజలు ఆ తర్వాత బీజేపీ అభ్యర్థిని గెలిపించారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి.. మోదీ వద్ద నుంచి నిధులు తీసుకువచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని గత ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు చెప్పారని, మరి ప్రత్యేకంగా ఏమైనా నిధులు తెచ్చారా? చెప్పాలన్నారు. రఘునందన్ రావుకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదన్నారు.

రేవంత్‌ ప్రశ్నల వర్షం..
రఘునందన్‌రావు ఎప్పుడూ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో బిజీగా ఉన్నారు తప్ప దుబ్బాకకు చేసిందేమీ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త కాదని, ఆయనది అంతా పాత చింతకాయ పచ్చడే అన్నారు. ఈ పాత చింతకాయపచ్చడిని రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఏం చేశారు? అని నిలదీశారు. ఆయన దొర కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారని, గడీల వద్ద కాపలాగా ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు నిధులు ఎందుకు తీసుకురాలేదు? రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదు? దుబ్బాకకు పీజీ కాలేజీ ఎందుకు తేలేదు? చేగుంటలో డిగ్రీ కాలేజీ ఎందుకు తేలేదు? పేదవారికి ఎందుకు డబుల్ బెడ్రూంలు ఇప్పించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల నుంచి ఎంపీగా ఉన్న కొత్త చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ వద్ద బంట్రోతులా ఉన్నాడని విమర్శించారు.

ఆయన్ను ఎందుకు మంత్రిని చేయలేదు..
దుబ్బాక నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆనాడు దుబ్బాక నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తీసుకువెళ్తే ముత్యంరెడ్డి కొట్లాడి తీసుకువచ్చారన్నారు. హరీశ్ రావు కూడా మీ ప్రాంతానికి రావాల్సిన నిధులను అడ్డుకొని సిద్దిపేటకు తరలించుకుపోయారన్నారు. దుబ్బాకను కేసీఆర్ గౌరవించింది నిజమే అయితే ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న రామలింగారెడ్డిని ఎందుకు మంత్రిగా చేయలేదు? అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు.. రఘునందన్ రావును చూశారు.. ఇక ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని చూడండని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తే బీఆర్ఎస్‌కు వచ్చిన నొప్పి ఏమిటి? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం... కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.

కేసీఆర్ లక్ష కోట్లు మింగారని, హైదరాబాద్ నగరం చుట్టూ పదివేల ఎకరాల భూమిని ఆక్రమించాడని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ బక్కవాడు కాదని బకాసురుడు అని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే కుంభకర్ణుడివి అన్నారు. కేసీఆర్ లేస్తే మింగుతాడు.. మింగితే పడుకుంటాడు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోడన్నారు. దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ కుటుంబం అన్నారు. ఎందుకంటే ఇక్కడకు వచ్చిన సబ్ స్టేషన్లు, నిధులు, కాలేజీలను సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు