కేటీఆర్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేసిన రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ లేక టీఆర్‌ఎస్‌..

27 Sep, 2023 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ సర్కార్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌ ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం కేసీఆర్‌లో మొదలైంది. కేసీఆర్‌పై నమ్మకంలేకనే కవిత కోర్టుకు వెళ్లారని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కవిత అరెస్ట్ కోర్ట్ జోక్యం వల్ల ఆగిపోయింది. వాళ్ల పార్టీపై కేటీఆర్‌కే క్లారిటీ లేదు. ఓసారి టీఆర్‌ఎస్‌ అని.. మరోసారి బీఆర్‌ఎస్‌ అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 

కాగా, రేవంత్‌ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు సాయంత్రం మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుంది. చట్టంపై కేటీఆర్‌కు అవగాహన ఉందా?. ఎమ్మెల్సీల ఎంపిక చాలా కేటగిరీలలో జరుగుతుంది. కేటగిరీని బట్టి ఎంపిక విధానం ఉంటుంది. గవర్నర్ ఎంపికకు, ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధం లేదని విమర్శించారు. 

కాంగ్రెస్‌ విజయభేరి సభ చూసి కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చింది. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను దివాలా తీయించారు. కేసీఆర్‌ ఆరు లక్షల కోట్ల అప్పులు చేశారు. మా నాయకుడు రాహుల్‌ గాంధీ గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడం విడ్డూరం. రాహుల్‌ గాంధీ.. కేసీఆర్‌, కేటీఆర్‌లా బ్లఫ్‌ మాస్టర్‌ కాదు.. అన్ని నిజాలే మాట్లాడుతారు. ఎంఐఎం, బీఆర్ఎస్‌లేని చోట బీజేపీకి ఓటు వేయాలని అసదుద్దీన్ చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. 

పార్టీలో చేరడానికి అందరికీ ఆహ్వానమే.. టిక్కెట్ స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని 100 శాతం ప్రయత్నిస్తున్నాం. బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం. అన్ని సామాజికవర్గాల వారు మా పార్టీలో బలమైన వాదన వినిపించారు. వారి తరుఫున సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నా వాదన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు పార్టీకి పీసీసీ చీఫ్‌గా పని చేసారు. ఒక్కరైనా బీఆర్ఎస్‌కు బీసీ అధ్యక్షుడు అయ్యాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీని కోరాం. సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుంది అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌

మరిన్ని వార్తలు