కాంగ్రెస్‌ను వీడనున్న ఎంజీ వేణుగోపాల్‌ గౌడ్‌!

4 Jan, 2021 09:07 IST|Sakshi

వేణుగోపాల్‌ గౌడ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు సైతం.. 

నేడు బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరిక 

సాక్షి, కామారెడ్డి: గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతలు తిరిగి సొంతగూటి వైపు చూస్తున్నారు. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న డాక్టర్‌ సిద్ధరాములు, మోతె కృష్ణాగౌడ్, పుల్లూరి సతీశ్, జూలూరి సుధాకర్, చింతల రమేశ్, పేర రమేశ్, నర్సింలు, నరేందర్‌ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌ మొదట్లో బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన కామారెడ్డి కౌన్సిలర్‌గానూ పనిచేశారు. తరువాత ఆలె నరేంద్ర వెంట నడిచి కారెక్కారు. 2004లో ఆ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. (చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్‌!)

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. డాక్టర్‌ సిద్ధరాములు గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు. మోతె కృష్ణాగౌడ్‌ గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. పుల్లూరి సతీశ్, జూలూరి సుధాకర్, చింతల రమేశ్‌ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసినవారే. వీరంతా సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

మరిన్ని వార్తలు