జార్ఖండ్‌లో పొలిటికల్ హీట్.. బీజేపీ ఎంపీలపై కేసు

3 Sep, 2022 12:50 IST|Sakshi

రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది.

దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్‌ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. 

ఈ విషయంపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్  చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్‌ఘర్‌ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది.  ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్‌ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్‌లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.
చదవండి: నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు