Tripura Assembly Election 2023: త్రిపురలో ముగిసిన పోలింగ్‌.. 70 శాతం పోలింగ్‌ నమోదు

16 Feb, 2023 17:28 IST|Sakshi

Live Updates:

 త్రిపురలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో 69.96 శాతం పోలింగ్‌ నమోదు.

Time: 02.15PM
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.4 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

Time: 1.00PM
►బీజేపీ నాయకులు పలు చోట్ల ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ నిర్భయంగా ఓటు వేయకుండా ఆపుతున్నారు. సీపీఎం నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. అయితే బీజేపీ బెదిరింపులుకు గురిచేసిన జనం ఓట్లు వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Time: 11.00
►త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 31.23%  పోలింగ్‌ నమోదైంది.

► మాజీ సీఎం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు బిప్లబ్ కుమార్‌ దేబ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఎన్నికలను పెద్దవి, చిన్నవిగా చూడమని అన్నారు. ప్రజలే తమకు అత్యున్నతమని.. వారిని గౌరవించడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.  ‘2018లో ప్రజలు అధికారం అందించారు. కోవిడ్ ఉన్నప్పటికీ,  రాష్ట్రంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించాం.. ఇది ప్రజలకు  తెలుసు’ అని అన్నారు.

Time: 10.00
► త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 13.23% ఓటింగ్ నమోదైంది. 
 

►త్రిపుర సీఎం మాణిక్ సాహా ఓటుహక్కు వినియోగించుకున్నారు.  బోర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహారాణి తులసుబాతి బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓటు వేయడం ఆనందంగా ఉందని.. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ‘ శాంతియుత ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నా. నా ముందున్న సవాలు ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్‌- వామపక్షాలు కలిసి పోటీలోకి రావడమే సవాల్‌.’ అని తెలిపారు.

Time: 9.00
►త్రిపురలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని త్రిపుర ప్రజలను కోరుతున్నాను. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను’  మోదీ ట్వీట్ చేశారు. కాగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం  ప్రచారం చేసిన చేసిన విషయం తెలిసిందే.

అగర్తలా: రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, పరస్పర విమర్శనాస్త్రాల పర్వం ముగిశాక పోలింగ్‌ క్రతువుకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా అనిఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) గిట్టే కిరణ్‌కుమార్‌ దినకరో చెప్పారు.

పోలింగ్‌ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండగా 28 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ–ఐపీఎఫ్‌టీ కూటమి, సీపీఐ(ఎం)–కాంగ్రెస్‌ కూటమి, తిప్రా మోతాల మధ్యే అసలు పోరు ఆవిష్కృతంకానుంది.

13.53 లక్షల మహిళాఓటర్లుసహా మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి రెండో తేదీన ఓట్లు లెక్కిస్తారు. ‘ అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కలిపి మొత్తంగా 31వేల పోలింగ్‌ సిబ్బంది, 25వేల కేంద్ర భద్రతా బలగాలు, 31వేల రాష్ట్ర పోలీసు బలగాలు విధుల్లో కొనసాగనున్నాయి’ అని సీఈఓ చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా 17వ తేదీ ఉదయందాకా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చాం. అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసేశాం’ అని సీనియర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు.

55 చోట్ల బీజేపీ, 42 చోట్ల తిప్రామోతా
ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్‌ సాహా ఈసారి బర్దోవాలీ నుంచి బరిలో నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సాబ్రూమ్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తిప్రా మోతా చైర్మన్‌ ప్రద్యోత్‌ దేబ్‌ బర్మన్‌ ఈసారి పోటీచేయడంలేదు. బీజేపీ 55 చోట్ల తన అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ కూటమి పార్టీ ఐపీఎఫ్‌టీ ఆరు స్థానాల్లో పోటీచేస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒక స్థానంలో స్నేహపూర్వక పోటీకి సిద్దమయ్యాయి.

సీపీఎం 47 చోట్ల, కాంగ్రెస్‌ 13 చోట్ల, తిప్రా మోతా 42 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయి. గత ఐదేళ్లపాలనలో తాము చేసిన అభివృద్ధినే ఎన్నికల అజెండాగా బీజేపీ ప్రచారంచేయగా, దుష్ప్రరిపాలన అంటూ లెఫ్ట్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌లు విమర్శిస్తూ ప్రచారంచేయడం తెల్సిందే. గ్రేటర్‌ తిప్రాల్యాండ్‌ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ తిప్రా మోతా ఎన్నికల పర్వంలో మునిగిపోవడం విదితమే.  

మరిన్ని వార్తలు