రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి

14 Jun, 2021 01:47 IST|Sakshi

పదవులు దక్కడం లేదని సచిన్‌ పైలట్‌ వర్గం ఆగ్రహం 

మాట నిలబెట్టుకోకపోతే తమ దారి తాము చూసుకుంటున్నామని హెచ్చరిక

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అసమ్మతి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమకు గతంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని, ప్రభుత్వ పదవులు దక్కడం లేదని మండిపడుతోంది. అధికారంలో తమ వంతు వాటా కావాలని డిమాండ్‌ చేస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తమ దారి తాము చూసుకుంటున్నామన్న సంకేతాలను పైలట్‌ వర్గం ఇస్తోంది. పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ కూడా ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌ వర్గం మధ్య సయోధ్య కుదుర్చేందుకు గట్టిగా ప్రయత్నించడం లేదు.

తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ రాజస్తాన్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్‌ మాకెన్‌ స్పందించారు. కేబినెట్‌లో కొన్ని పదవులతోపాటు నామినేటెడ్, కార్పొరేషన్‌ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తారని, ఎవరూ నిరాశపడొద్దని అసమ్మతి నేతలను కోరారు. సచిన్‌ పైలట్‌తో తాను తరచుగా మాట్లాడుతూనే ఉన్నానని, ఆయనలో ఎలాంటి అసంతృప్తి లేదని వివరించారు. మరోవైపు తమలో సహనం నశించిపోతోందని పైలట్‌ వర్గం చెబుతోంది. పైలట్‌ వర్గం నుంచి బయటకు రావాలని సీఎం గహ్లోత్‌ తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తోంది. పార్టీ పరిధులను అతిక్రమించకుండా హక్కుల కోసం పోరాడుతామని తేల్చిచెబుతోంది. పైలట్‌ వెంట ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్టానం పైలట్‌ అనుచరులకు హామీ ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని పైలట్‌ వర్గ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్‌ సోలంకి ఆరోపించారు. దీనిపై రాజస్తాన్‌ బీజేపీ అధ్యక్షుడు సతీష్‌ పూనియా స్పందిస్తూ... గహ్లోత్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలను భయపెడుతోందన్నారు.

త్వరలో కేబినెట్‌ విస్తరణ! 
సచిన్‌ పైలట్‌ వర్గం అసంతృప్తి పెరుగుతుండటంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి అజయ్‌ మాకెన్‌  వైరివర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైలట్‌ రెండురోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 9 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచడం.. సామాజికవర్గ సమీకరణాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. 

మరిన్ని వార్తలు