హుజూరాబాద్‌లో వేడి తగ్గకుండా పార్టీల వ్యూహాలు 

23 Aug, 2021 07:59 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై పార్టీలన్నీ పట్టు బిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ– టీఆర్‌ఎస్‌ నువ్వానేనా అన్న స్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల శాలపల్లిలో జరిగిన సీఎం సభతో గులాబీ నేతల్లో జోష్‌     పెరగగా.. కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు యాత్రలు షురూ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌  ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉండటంతో ధీటైన స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచనలో ఉంది. ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎక్కడా     తగ్గవద్దని, మరింత పట్టుబిగించాలని అధిష్టానాలు ఆదేశించాయి.

అభివృద్ధి నినాదంతో గులాబీనేతలు..
► దళితబంధు అమలు చేస్తోన్న నేపథ్యంలో కారుపార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. దీనికితోడు నోటిఫికేషన్‌ వచ్చేలోగా నియోజకవర్గంలోని పెండింగ్‌ పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
► హుజూరాబాద్‌ మండలం మొత్తం మంత్రి గంగుల కమలాకర్‌ పర్యవేక్షిస్తున్నారు.  వీణవంక మండల బాధ్యతలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు భుజాలకెత్తుకున్నారు. జమ్మికుంట టౌన్‌ ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తలమునకలయ్యారు. జమ్మికుంట రూరల్‌ పనులు  ఆరూరి రమేశ్‌ చూస్తున్నారు. 
► కీలకమైన ఇల్లందకుంట మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పర్యవేక్షిస్తున్నారు. కమలాపూర్‌ మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు.
► సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి పార్టీల పేర్లను పెద్దగా ప్రస్తావించకుండానే.. నేతలు ప్రసంగిస్తుండటం గమనార్హం.

యాత్రలతో కమలనాథుల ఉత్సాహం..
► హుజూరాబాద్‌లో బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో చేసిన పర్యటన ఆ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 
► గతంలో ఈటల రాజేందర్‌ జన ఆశీర్వాద యాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఇక త్వరలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నికకు బాగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. 
► జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ అరవింద్‌ను నియమించారు. జమ్మికుంట మండలం బాధ్యతలు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుకు అప్పగించారు. హుజూరాబాద్‌ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. 
► ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్‌ మండలానికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు చేస్తోన్న ప్రచారాలు, రోడ్‌షోలతోపాటు నాయకుల యాత్రలు తమకు కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారు.

కొండా సురేఖ పేరు లాంఛనమే..!
► ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడ బలమైన నాయకులను బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. స్థానికనేతలైన పత్తి క్రిష్ణారెడ్డిని, ఎన్‌ఆర్‌ఐ పాడి ఉదయానంద్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు సంప్రదించారని తెలిసింది. 
► ఈ క్రమంలోనే వరంగల్‌ జిల్లాకు చెందిన బలమైన నేత, మాజీమంత్రి కొండా పేరును కొందరు ప్రతిపాదించారు. హుజూరా బాద్‌ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్‌కు భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉండటంతో కొండా సురేఖ సైతం పోటీకి సై అన్నారని తెలిసింది. 
► అయితే, ఇక్కడ పోటీ చేయాలంటే ఆమె కొన్ని షరతులు విధించారని సమాచారం. 2023 ఎన్నికల సందర్భంగా తనకు ఉన్న డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తే పోటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న కొండా వర్గీయుల ప్రతిపాదనకు అధిష్టానం కూడా అంగీకరించిందని సమాచారం. 
► వాస్తవానికి ఇటీవల రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోనే కొండా పేరును ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాఖీపౌర్ణమి అనంతరం సురేఖ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. 

చదవండి: మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్‌ విజయవంతం

మరిన్ని వార్తలు